ఆసిఫాబాద్: కుమ్రం భీం ఆసిఫాబాద్ (Asifabad) జిల్లాలో పులి దాడిలో మహిళ మృతిచెందింది. శుక్రవారం ఉదయం కాగజ్నగర్ మండలం నజ్రుల్ నగర్లో వ్యవసాయ పనులకు వెళ్తుండగా మహిళపై పులి దాడి చేసింది. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. తోటి కూలీలు కేకలు వేయడంతో అది పారిపోయింది. వెంటనే ఆమెను దవాఖానకు తరలించారు. అయితే ఆమె అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతురాలిని గన్నారం వాసి మోర్లె లక్ష్మీగా (21) గుర్తించారు. మృతదేహంతో కాగజ్నగర్ అటవీ కార్యాలయం ముందు ఆమె బంధవులు ధర్నాకు దిగారు. తమకు న్యాయం చేయాలని ఆందోళన చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కాగా, ఆసిఫాబాద్ జిల్లాలో గత కొన్ని రోజులుగా పెద్దపులి కలలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. గురువారం ఉదయం వాంకిడి మండలంలోని సోనాపూర్ అటవీ ప్రాంతంలో పశువుల మందపై దాడిచేసింది. తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దుల్లో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు వెల్లడించారు. గత ఆదివారం కూడా మండలంలోని దాబా, బండకాస గ్రామంలో కోర్ డోబ్రాలొద్ది ప్రాంతంలో ఆవుల మందపై పులిదాడి చేసింది. ఈ దాడిలో ఒకఆవు మృతిచెందగా మరో రెండుఆవులకు తీవ్ర గాయాలు అయ్యాయి. బండకాస గ్రామానికి చెందిన పశువుల కాపరి సోయం బాబురావు ఆదివారం మధ్యాహ్నం గ్రామసమీపం లో పశువులను మేతకు తీసుకువెళ్లాడు. మధ్యాహ్నం పులి పశువుల మందపై దాడిచేసింది. పశువుల కాపరి పులిని చూసి భయందోళనకు గురై గ్రామస్థులకు సమాచారం అందించారు. గ్రామస్థులు అటవీశాఖ అధికారులకు సమా చారం అందించారు. అనంతరం వారు వచ్చి ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు. పులి పశువుల మందైప దాడి చేయడంతో సమీపప్రాంతాల గిరిజన రైతులు భయాందోళకు గురవుతున్నారు.