హైదరాబాద్ : ఫార్ములా ఈ రేస్ పోటీలకు హైదరాబాద్ నగర్ సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 11న ప్రారంభం కాబోయే ఫార్ములా ఈ రేస్‌కు సంబంధించిన టికెట్లను బుక్ మై షోలో విడుదల చేశారు. ఈ టికెట్ల విడుదల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపాలిటీ, అర్బన్ డెవలప్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ హాజరయ్యారు.
రూ. 1000 నుంచి రూ. 10 వేల వరకు టికెట్లు అందుబాటులో ఉన్నాయి. మొత్తంగా 22,500 టికెట్లను విక్రయించనున్నారు. రూ. 1000కు గ్రాండ్ స్టాండ్, రూ. 3,500కు ఛార్జ్ గ్రాండ్ స్టాండ్, రూ. 6 వేలకు ప్రీమియం గ్రాండ్ స్టాండ్, రూ. 10 వేలకు ఏస్ గ్రాండ్ స్టాండ్ టికెట్లను విక్రయించనున్నారు.
అయితే ఫిబ్రవరి 11న ఫార్ములా ఈ రేస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో 10వ తేదీన ప్రాక్టీస్ రేసింగ్ నిర్వహించనున్నారు. ఈ రేస్‌లో 11 దేశాల నుంచి మొత్తం 22 మంది డ్రైవర్లు పాల్గొంటున్నారు. రేస్ నిర్వహణ కోసం హుస్సేన్ సాగర్ తీరాన 18 మలుపులతో 2.8 కిలోమీటర్ల మేర ట్రాక్‌ను ఏర్పాటు చేశారు. గత నెలలో ఇండియన్ రేసింగ్ లీగ్‌ను నిర్వహించిన సంగతి తెలిసిందే.