Tummala Nageshwar Rao | బయ్యారం : కరువు కటకాలు.. ఆత్మహత్యలకు నెలవైన తెలంగాణ నేడు పచ్చని పైర్లతో కళకళలాడుతూ దేశానికి అన్నం పెట్టే స్థాయికి ఎదిగిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరావు అన్నారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియా నాయక్ అధ్యక్షతన జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 24గంటల ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమాలాంటి పథకాలతో తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం పండుగలా మారిందన్నారు.
నేడు తెలంగాణ రాష్ట్రంలో పండిస్తున్న వరి దేశంలోని అన్ని రాష్ట్రంలో పండిస్తున్న ధాన్యానికి సమానమని ఈ ఘనత వెనుకకు ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ విశేష కృషి దాగి ఉన్నదని తెలిపారు. నాటి తెలంగాణలో ప్రజలు పనుల కోసం వలస బాటపడితే నేడు ఇతర రాష్ట్రల నుంచి మన రాష్ట్రానికి వలస వస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో అమలవుతన్న సంక్షేమ పథకాలపై యావత్ దేశ ప్రజలు ఆకర్షితులై దేశంలో కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని చెప్పారు. తమ రాష్ట్రంలోనూ బీఆర్ఎస్ పాలన
కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు.
తెలంగాణలో ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తంచేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది సీట్లు బీఆర్ఎస్ గెలుచుకోవడం ఖాయమని జోస్యం చెప్పారు. తెలంగాణలో విద్య, వైద్యం, సాగుకు పెద్దపీట వేస్తున్నారని దేశంలో ఎక్కడా లేని విధంగా అత్యుత్తమ సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలు అవుతున్నాయని వివరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రూ.1,300 కోట్లతో చేపట్టిన సీతారామ ప్రాజెక్ట్ గోదావరి నీటితో ఇల్లందు నియోజకవర్గం సస్యశామలం అవుతుందని, బయ్యారం పెద్ద చెరువుకు సీతారామ నీటిని తీసుకొస్తామని తుమ్మల పేర్కొన్నారు.