తొర్రూరు : గంజాయి మత్తులో ముగ్గురు యువకులు వీరంగం సృష్టించారు. దారినపోయే వాహనాలను ఆపి డబ్బులు డిమాండ్ చేశారు. ఇవ్వకపోతే దాడులకు పాల్పడ్డారు. వాహనాల డ్రైవర్లను, క్లీనర్లను రాళ్లతో కొట్టారు. వాహనాల అద్దాలు పగులగొట్టారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ ఉప్పల్‌లోని చిలుకానగర్‌కు చెందిన తోల్ల అభిలాష్ తన క్లీనర్ చిన్నతో కలిసి, డీసీఎం వాహనం (TS 08 UG 8999) లో మిషన్ బేరింగుల లోడుతో జార్ఖండ్‌కు, రాజమండ్రికి చెందిన పెద్దపాటి రాంబాబు తన లారీ (AP 16 TS 4727) లో కోళ్ల దాణా లోడుతో మహారాష్ట్ర నుంచి నూజివీడుకు సోమవారం రాత్రి వెళ్తున్నారు. అర్ధరాత్రి రెండు గంటల సమయంలో తొర్రూరు పట్టణ పరిధిలోని దుబ్బతండా సమీపానికి ఆ వాహనాలు చేరుకున్నాయి.
అక్కడ గంజాయి మత్తులో ఉన్న ముగ్గురు యువకులు వాహనాలను అడ్డగించారు. ‘పర్మిట్ చూపించాలని, లేదంటే డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించిన డ్రైవర్ రాంబాబుపై రాళ్లతో దాడిచేసి గాయపరిచారు. ఆ తర్వాత లారీ, డీసీఎం వాహనాల అద్దాలను పగలగొట్టి భయాందోళనలకు గురిచేశారు. వెంటనే బాధితులు 100 నంబర్‌కు సమాచారం ఇవ్వగా తొర్రూరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. ఘటనపై బాధిత డ్రైవర్లు మాట్లాడుతూ.. తమకంటే ముందు కూడా మూడు నాలుగు వాహనాలను ఇలాగే ఆపేందుకు ప్రయత్నించారని, తాము దొరికి నష్టపోయామని చెప్పారు. తాము ఎప్పుడూ తొర్రూరు మీదుగానే వెళ్తుంటామని, కానీ ఇలా జరగడం మొదటిసారని అన్నారు. ఘటనపై ఎస్సై గొల్లమూడు ఉపేందర్ వివరణ కోరగా.. ఘటన గురించి వివరాలు తెలిపారు.
వీరంగం చేసిన యువకులు గంజాయి సేవించలేదని, మద్యం మత్తులోనే అంతా చేశారని చెప్పారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామన్నారు. పరారీలో ఉన్న వ్యక్తిని త్వరలో పట్టుకుంటామని తెలిపారు.