చర్ల, సెప్టెంబర్ 9 : నిర్మాణంలో ఉన్న మిషన్ భగీరథ పథకం సంపులో చిక్కుకొని ముగ్గురు కార్మికులు మృతిచెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం ఉంజిపల్లిలో మంగళవారం చోటుచేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం.. ఉంజిపల్లిలో నిర్మిస్తున్న మిషన్ భగీరథ పథకం వాటర్ ట్యాంకు వద్దకు పని చేసేందుకు కార్మికుడు నీలం తులసీరాం(37) వెళ్లాడు. సంపులోకి దిగిన అతడు ఎంతకూ బయటకు రాలేదు. తులసీరాంను కాపాడేందుకు ఉంజిపల్లికి చెందిన కాకా మహేశ్ (34) లోనికి దిగగా అతడు కూడా లోపలే చిక్కుకుపోయాడు. వీరిని కాపాడేందుకు దిగిన అనసూరి అప్పలరాజు,ఇస్పాక్ కూడా అందులోనే చిక్కుకుపోయారు. గమనించిన తోటి కార్మికులు ఆ నలుగురిని చర్ల సీహెచ్సీకి తరలించారు. అప్పటికే తులసీరాం, మహేశ్ మృతి చెందగా ఇస్పాక్ చికిత్స పొందుతూ మృతి చెందాడు.