SSC Exam Paper Leak | హైదరాబాద్/తాండూరు, ఏప్రిల్ 4: పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీలో బాధ్యులపై పాఠశాల విద్యాశాఖ కఠిన చర్యలు చేపట్టింది. ఘటనలో ప్రధాన కారకులుగా గుర్తించి ముగ్గురు టీచర్లను డిస్మిస్ చేసింది. అదేవిధంగా కమలాపూర్ జిల్లా పరిషత్ పాఠశాల పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ అధికారిని సస్పెండ్ చేసింది. సర్వీస్ నుంచి తొలగించిన ఉపాధ్యాయుల్లో వికారాబాద్ జిల్లాకు చెందిన బందెప్ప, సమ్మప్ప, హనుమకొండ జిల్లా కమలాపూర్‌కు చెందిన సబియా మడావత్ ఉన్నారు. ప్రశ్నపత్రాన్ని బయటకు చేరవేసిన విద్యార్థిని ఐదేండ్లు డిబార్ చేసింది. హనుమకొండ జిల్లా కమలాపూర్ జడ్పీ ఉన్నత పాఠశాలలో మంగళవారం ఉదయం పరీక్ష ప్రారంభమైన అనంతరం 9.45 గంటలకు శివాజీ అనే యువకుడు పాఠశాల గోడ దూకి పరీక్ష కేంద్రంలోకి ప్రవేశించాడు. కిటికీ పక్కనే కూర్చున్న ఎం శివకుమార్ అనే విద్యార్థి వద్ద హిందీ పరీక్ష ప్రశ్నపత్రం తీసుకొని, దాన్ని ఫొటోలు తీసి 9.59 గంటలకు విద్యార్థుల వాట్సాప్ గ్రూప్‌లో పోస్టు చేశాడు.
ఆ గ్రూపు నుంచి మాజీ జర్నలిస్టుకు, ఇతర జ ర్నలిస్టుల గ్రూపుల్లో ప్రశ్నపత్రం పోస్ట్ అయ్యిం ది. దీంతో సోషల్ మీడియాలో ప్రశ్నపత్రం బయటికి వచ్చినట్టు గుర్తించిన విద్యాశాఖ అధికారులు హనుమకొండ జిల్లా కలెక్టర్‌కు, పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణ అనంతరం ఘటనకు బాధ్యురాలిగా గుర్తి స్తూ ఇన్విజిలేటర్ సబియా మడావత్ను డిస్మిస్ చేశారు. చీఫ్ సూపరిండెంట్ ఎం శివప్రసాద్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్ టీ శ్రీధర్‌ను సస్పెండ్ చేశారు. విద్యార్థి ఎం శివకుమార్‌ను ఐదేండ్లు డిబార్ చేస్తూ హనుమకొండ జిల్లా విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వికారాబాద్ జిల్లాలో పేపర్ బయటికి వచ్చిన ఘటనకు బాధ్యులైన బందెప్ప, సమ్మప్పను పోలీసులు అరెస్టు చేశా రు. తప్పు ఒప్పుకోవడంతో వారిపై ఐపీసీ సెక్షన్ 409, సెక్షన్ 5,10 టీఎస్ పబ్లిక్ ఎగ్జామినేషన్ (ప్రివెన్షన్ ఆఫ్ మాల్ ప్రాక్టీస్ ఆండ్ అన్ఫేర్) యాక్ట్ ఆర్/డబ్ల్యూ 34 కింద కేసు నమోదు చేసినట్టు తాండూరు పట్టణ సీఐ రాజేందర్‌రెడ్డి తెలిపారు. ‘పరీక్షలు జరుగుతున్న సమయంలో నంబర్-1 ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న బందెప్ప ఫోన్‌తో ప్రశ్నపత్రాలు ఫొటో తీసి చెంగోల్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న సమ్మప్పకు వాట్సాప్‌లో పంపాడు. ఇదే సమయం లో పొరపాటున తాండూరులోని ఓ మీడియా గ్రూప్‌లోకి తెలు గు ప్రశ్నపత్రాలు పెట్టాడు’ అని వెల్లడించారు. నిందితులను రిమాండ్‌కు తరలించినట్టు వివరించారు. జవాబులను మైక్రో జిరాక్స్ చేసిన విద్య బుక్‌సెంటర్ నిర్వాహకుడు శివ పరారీలో ఉన్నట్టు పేర్కొన్నారు.