నిడమనూరు, మే 30: నల్లగొండ జిల్లాలో నకిలీ సర్టిఫికెట్లతో అక్రమంగా పట్టాలు పొంది న వ్యవహారంలో ముగ్గురు నిందితులను పోలీసులు గురువారం రిమాండ్‌కు తరలించారు. ఈ భూ బాగోతంలో నిందితులుగా ఉన్న మ రో ముగ్గురు తహసీల్దార్లు పరారీలో ఉన్నారు. నిడమనూరు మండలం తుమ్మడం గ్రామ శివారులోని 541,961,840,1072 సర్వే నంబర్లలోని తొమ్మిది ఎకరాల భూమికి బొ మ్ము ఆదిలక్ష్మి, మార్తి సురేందర్‌రెడ్డి, మార్తి శ్వేత, మార్తి నిర్మల నకిలీ పట్టాలతో పట్టాదారు పాస్‌పుస్తకాలు పొందినట్టు ఆరోపణలున్నాయి.
మార్తివారిగూడెం గ్రామానికి చెందిన మార్తి వెంకట్‌రెడ్డి 2022లో అప్పటి నల్లగొండ జిల్లా కలెక్టర్, విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో అప్పటి తహసీల్దార్ ప్రమీల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో వేగం పెంచాలని మార్తి వెంకట్‌రెడ్డి ఇటీవల మరోమారు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో మొదటి నిందితుడు బొమ్ము శ్రీనివాస్, రెండో నిందితుడు ముదిగొండ సుమన్, ఏడో నిందితుడు మార్తి సురేందర్‌రెడ్డిని గురువారం మిర్యాలగూడ కోర్టులో ప్రవేశపెట్టారు. తహసీల్దార్లు దేశ్యానాయక్ను ఏ3గా, నాగార్జునరెడ్డిని ఏ4గా, ఏఆర్ నాగరాజును ఏ5గా పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌లో చేర్చారు.
ఈ కేసులో వీఆర్వో వ్యక్తిగత సహాయకుడు బొమ్ము శ్రీనివాస్ తన భార్య ఆదిలక్ష్మి పేరున ఐదెకరాలు, మార్తి సురేందర్‌రెడ్డి తన భార్య శ్వేత పేరున 2.19 ఎకరాలు, మార్తి నిర్మల పేరున 1.20 ఎకరాల భూమికి 2007లో తహసీల్దార్‌గా పనిచేసిన టీ విద్యాసాగర్ సం తకాలను ఫోర్జరీ చేసి పట్టా సర్టిఫికెట్లు పొం దినట్లుగా వీరిపై అభియోగాలు ఉన్నాయి.