మంచిర్యాల, జూలై 21(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మంచిర్యాల జిల్లా సాయికుంటలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో ముగ్గురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. నాలుగు రోజుల క్రితం ఆశ్రమ పాఠశాలలో పురుగుల అన్నం తినడంతో ఎనిమిదో తరగతి విద్యార్థిని బైరినేని తరుణి, ఆరోతరగతి చదువుతున్న బైరినేని రేవతి, అలకనంద అస్వస్థతకు గురయ్యారు. తరుణి, రేవతి తల్లి జ్యోతి మాట్లాడుతూ.. పిల్లలు గురువారం సిక్ కాగా ఆదివారం ఫోన్‌చేసి రేవతికి సీరియస్‌గా ఉందని చెప్పారని తెలిపారు.
సోమవారం మంచిర్యాలలోని మాతా, శిశు దవాఖానకు తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు రెండు రోజులుంటే పాప చనిపోయేదని చెప్పారంటూ రోదిస్తూ చెప్పారు. తరుణి మాట్లాడుతూ.. హాస్టల్లో శనివారం పెసరపప్పు, చారు తిన్నాక వాంతులు అయ్యాయని చెప్పారు. విద్యార్థినులు మూడు రోజులు ఇంటికి వెళ్లి వచ్చాకే అస్వస్థతకు గురయ్యారని మంచిర్యాల కలెక్టర్ కుమార్‌దీపక్ పేర్కొన్నారు.
విద్యార్థినులను దవాఖానలో చేర్పించిన అనంతరం తల్లిదండ్రులు గిరిజన ఆశ్రమ పాఠశాలకువెళ్లగా వారిని లోపలికి అనుమతించకుండా గేట్‌వేసి అడ్డుకున్నారు. దీంతో తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు ధర్నాకు దిగారు. ఈ ఘటనపై పూర్తి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు చేరుకుని వారికి సర్దిచెప్పి పంపించి వేశారు. మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు దవాఖానకు వెళ్లి విద్యార్థిని పరామర్శించారు.