హైదరాబాద్, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ): ‘పార్టీలో ఈ మధ్య అంతర్గత ప్రజాస్వామ్యం పెరిగిపోయిందబ్బా. కాంగ్రెస్‌లో లెక్క గ్రూపులు కడుతున్నరు’ బీజేపీలో తాజా పరిణామాలపై ఒక నాయకుడి విశ్లేషణ ఇది. తెలంగాణ బీజేపీలో వర్గపోరు పెరుగుతున్న ది. ఇప్పటికే కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెరొక గ్రూప్‌గా వ్యవహరిస్తున్నారు. పార్టీలో ఆధిపత్యం కో సం ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. బండి ఉపయోగించే భాష, ఆయన వ్యవహార శైలిపై కిషన్‌రెడ్డి తన అనుచరుల వద్ద అనేక సందర్భాల్లో అసహనం వ్యక్తంచేశారు. వీరిద్దరూ కలిసి ఒకే వేదిక మీద కనిపించిన సందర్భాలు చాలా అరుదు. హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీలో వర్గపోరుపై ఆసక్తికర చర్చలు నడుస్తున్నాయి. హుజూరాబాద్‌లో ఈటల గెలుపు ఓటమిల ప్రభావం బీజేపీ గ్రూప్ రాజకీయాలపై పడే అవకాశం ఉన్నదని ఆ పార్టీ సర్కిల్స్ చర్చించుకొంటున్నాయి. ఈటల గెలిస్తే తమకు లాభమని ఒక గ్రూప్ లెక్కలేస్తుంటే.. ఆయన ఓడితేనే తమ కు మంచిదని మరోవర్గం భావిస్తున్నది. ఇలాంటి లాభనష్టాల లెక్కలకు అనుగుణంగానే ఆయా గ్రూప్‌లు ఎన్నికల ప్రచారాలు నిర్వహిస్తున్నాయి.
ఈటల బీజేపీలో చేరడం బండి వర్గానికి ఇష్టం లేదన్న టాక్ వినిపిస్తున్నదే. అందుకే ఆయన ప్రచారంలో పెద్దగా పాల్గొనడంలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఎన్నికలు ముగిసిన తర్వాత ఈటల ఏ గ్రూప్‌లో చేరతారు? అసలు బీజేపీలో ఉంటారా? కాంగ్రెస్‌లోకి వెళ్తారా? అనే అనుమానాలు ఆ పార్టీలో ముసురుకొన్నాయి. దీనికితోడు హుజూరాబాద్ ప్రచారం నేపథ్యంలో నలుగురైదుగురు నాయకులు మరో గ్రూప్‌గా ఏర్పడినట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కిషన్‌రెడ్డి, బండి గ్రూపుల మధ్య విబేధాలను ఉపయోగించుకొని, లాభపడాలని చూస్తున్న మరికొందరు నాయకులు ప్రస్తుతం తటస్థ గ్రూప్‌ను మెయింటెయిన్ చేస్తున్నారు. మరికొందరు కొత్త కుంపటి పెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. టీఆర్ఎస్లో కీలకనేతగా గుర్తింపు, గౌరవం పొందిన ఈటల రాజేందర్ ఎన్నికలు ముగిసిన తర్వాత ఏ గ్రూపులో తలదాచుకొంటారన్నది ప్రశ్నార్ధకంగా మారింది. ఆరెస్సెస్ బ్యాక్ గ్రౌండ్‌లేని వారు బీజేపీలో ఇమడటం కష్టమనే అభిప్రాయం ఎప్పటి నుంచో ఉన్నదే.