జహీరాబాద్, ఫిబ్రవరి 24 : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ కుంభమేళాకు వెళ్లి, అక్కడి నుంచి కాశీవిశ్వనాథుడి దర్శనానికి వెళ్తుండగా వారణాసి దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో సంగారెడ్డి జిల్లావాసులు ముగ్గురు దుర్మరణం చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. బాధిత కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం గంగ్వార్‌కు చెందిన వెంకట్రామిరెడ్డి (42) ఇరిగేషన్‌శాఖలో కోహీర్ మండల డీఈగా పనిచేస్తున్నాడు. అతడి భార్య విలాసిని (40), సంగారెడ్డి పట్టణానికి చెందిన ఉపాధ్యాయులు విశాల, మోతీలాల్, రాయికోడ్ మండలం ఇటికేపల్లికి చెందిన జ్ఞానేశ్వర్‌రెడ్డి, న్యాల్కల్ మండలం మల్గికి చెందిన కారు డ్రైవర్ మల్లారెడ్డి శనివారం కుంభమేళాకు వెళ్లారు.
ఆదివారం ప్రయాగ్‌రాజ్‌లో పుణ్యస్నానాలు ఆచరించి, కాశీకి బయలుదేరారు. మీర్జాపూర్ జిల్లా తుల్సి గ్రామ సమీపంలోని రేవా- వారణాసి జాతీయ రహదారిపై వెళ్తున్న బైక్‌కు ఢీకొట్టిన కారు అదుపుతప్పి ఆగి ఉన్న టిప్పర్‌కు ఢీకొట్టింది. దీంతో బైక్ రైడర్, కారులో ప్రయాణిస్తున్న డీఈఈ, అతడి భార్య, కారు డ్రైవర్ అక్కడిక్కడే మృతి చెందారు. డీఈ వదిన విశాల, మరో ఉపాధ్యాయుడు మోతీలాల్, జ్ఞానేశ్వర్‌కు తీవ్రగాయాలు కావడంతో అక్కడి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఘటనాస్థలాన్ని వారణాసి ఎస్పీ సోమేంద్రనాథ్, అడిషనల్ ఎస్పీ ఏపీసింగ్ సందర్శించి దర్యాప్తు చేపట్టారు.