భైంసా, ఆగస్టు 22: నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో పైకప్పు పెచ్చులూడి ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రయాణికురాలు శ్రీలత తన కూతురు సహస్రతో కలిసి గురువారం నందిపేట్ నుంచి కుభీర్‌కు వెళ్తున్నది. బస్టాండ్ ప్రాంగణంలో కుభీర్ ప్లాట్ ఫాం వద్ద కూర్చున్నది. వారి పక్కనే సంగీత అనే ప్రయాణికురాలు కూడా ఉన్నది. ఇంతలో బస్టాండ్‌లోని పైకప్పు పెచ్చులు ఊడి పడటంతో శ్రీలత చేయికి, తలకు గాయాలయ్యాయి.
కూతురు సహస్రకు, సంగీతకు కూడా గాయాలవడంతో వెంటనే చికిత్స నిమిత్తం భైంసా ప్రభుత్వ ఏరియా దవాఖానకు తరలించారు. విషయం తెలుసుకున్న డీఎం హరిప్రసాద్, ఆర్డీవో కోమల్‌రెడ్డి దవాఖానకు చేరుకుని పరామర్శించారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.
హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): రాత్రివేళల్లో మహిళలు పోలీసులకు ఫోన్‌చేస్తే ఉచిత రవాణా సదుపాయం కల్పిస్తారంటూ రెండు రోజులుగా సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న వార్త బూటకమని తేలింది. ఇది తమపై జరుగుతున్న దుష్ప్రచారమని తెలంగాణ పోలీసులు ఖండించారు. ఎలాంటి ఎమర్జెన్సీ అయినా బాధితులు 100 నంబర్‌కు మాత్రమే ఫోన్ చేయాలని స్పష్టం చేశారు. ‘రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య అత్యవసర పరిస్థితి ఉన్న మహిళలు 1091 లేదా 7837018555 నంబర్లకు ఫోన్ చేస్తే..
స్థానిక పోలీసు వాహనం వచ్చిన మిమ్మల్ని సురక్షితంగా ఇంటి వద్ద దించుతుంది’ అంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరిగింది. స్పందించిన పోలీస్ శాఖ 7837018555 నంబర్ తమది కాదని, అది పంజాబ్‌లోని లూధియానా పోలీసులకు సంబంధించిందని మిగతా రాష్ర్టాల పోలీసులకు దానితో సంబంధం లేదన్నారు. తెలంగాణ పోలీసులకు సంబంధం లేని విషయాలను వైరల్ చేసి ప్రజలను అయోమయానికి గురిచేయవద్దని హెచ్చరించారు. అత్యవసర పరిస్థితులు ఎదురైతే డయల్ 100కి కాల్ చేయాలని సూచించారు.