మల్లాపూర్/ ముత్తారం/కామారెడ్డి రూరల్, సెప్టెంబర్ 1: రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం డెంగ్యూతో ముగ్గురు మృత్యువాత పడ్డారు. కుటుంబసభ్యుల వివరాల ప్రకా రం.. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం చిట్టాపూర్‌కు చెందిన మైలారపు సందేశ్(25) ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లి, నెల రోజుల క్రితమే స్వగ్రామానికి వచ్చాడు. వారం రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాడు. డెంగ్యూ పాజిటివ్ రాగా, నిజామాబాద్‌లోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండల కేంద్రానికి చెందిన మామిడి శ్రీలత(40) కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్నది. శుక్రవారం హన్మకొండలోని ఓ ప్రైవేటు దవాఖానలో చేర్పించగా, డెంగ్యూ పాజిటివ్‌గా నిర్ధారించారు. శనివారం రాత్రి పరిస్థితి విషమించి మృతి చెందింది. కామారెడ్డి మండలం టేక్రియాల్‌కు చెందిన చౌకి సుజిత్ (16) పట్టణంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు. వారం రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్నాడు. డెంగ్యూ నిర్ధారణ కావడంతో హైదరాబాద్ లోని నిమ్స్‌కు తరలించగా చికిత్సపొందుతూ ఆదివారం మృతి చెందాడు.