బోధన్ రూరల్, ఫిబ్రవరి 20: కరెంట్ కాటుకు ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బలైన ఘటన నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం పెగడపల్లిలో గురువారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. రెంజల్ మండలం సాటాపూర్‌కు చెందిన ఒర్పు గంగారాం (45)కు ఇద్దరు భార్యలు, ఐదుగురు సంతానం. వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
గంగారాం, భార్య బాలమణి (40), కుమారుడు కిషన్ (20) బుధవారం అర్ధరాత్రి తర్వాత అడవి పందుల వేటకోసం బోధన్ మండలం పెగడపల్లి శివారులోకి వెళ్లారు. అక్కడి పొలంలో ప్రమాదవశాత్తు కరెంట్ తీగలు తగలడంతో ముగ్గురూ విద్యుత్తు షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందారు. బోధన్ రూరల్ సీఐ విజయ్‌బాబు, సిబ్బంది మృతదేహాలను నిజామాబాద్ ప్రభుత్వ దవాఖానకు తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు. పందుల వేట కోసం వెళ్లారా.. లేక మరేదైనా కారణం ఉందన్న కోణంలో విచారణ సాగించారు.