Sarpanch Elections | సిరిసిల్ల రూరల్, డిసెంబర్ 6: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలోని వేణుగోపాలపూర్, బాలమల్లుపల్లె, గండిలచ్చపేట గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. ఈ నెల 2వ తేదీన నామినేషన్ల స్వీకరణ పూర్తి కాగానే సర్పంచ్, వార్డు స్థానాలకు బాలమల్లుపల్లెలో సర్పంచ్, ఆరు వార్డులకు సింగిల్ డిజిట్ నామినేషన్లు, వేణుగోపాలపూర్ సర్పంచ్ స్థానానికి, 5 వార్డు స్థానాలకు సింగిల్ డిజిట్ నామినేషన్లు రావడంతో ఏకగ్రీవానికి కలెక్టర్ పరిశీలనకు అధికారులు పంపించారు. వాటిని పరిశీలించిన అనంతరం కలెక్టర్ అనుమతి ఇవ్వగానే బాలమల్లుపల్లె, వేణుగోపాలపూర్ గ్రామ పంచాయతీ ఎన్నిక ఏకగ్రీవమైనట్లు ప్రకటించారు.
బాలమల్లుపల్లె గ్రామ సర్పంచ్‌గా యాద ఎల్లయ్య యాదవ్, వేణుగోపాలపూర్ సర్పంచ్‌గా జూపల్లి రామదేవి ఏకగ్రీవమైనట్లు తెలిపారు. సర్పంచ్, వార్డు సభ్యులు ఏకగ్రీవం కావడంతో బాలమల్లుపల్లె, వేణుగోపాలపూర్ గ్రామాల్లోని ఉప సర్పంచ్ కోసం శనివారం నాడు ఎన్నికలు సైతం నిర్వహించారు. బాలమల్లుపల్లెలో ఉపసర్పంచ్ దొరగల్ల రాజు, వేణుగోపాలపూర్ ఉపసర్పంచ్
లింగంపల్లి ప్రదీప్ కుమార్‌లను ఎన్నుకున్నారు.
తంగళ్లపల్లి మండలం గండిలచ్చపేట గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నిక ఉత్కంఠగా మారింది. సర్పంచ్ బరిలో ముగ్గురు అభ్యర్థులు జంగిటి అంజయ్య, నీరటి బాబు, బల్లెపు ప్రశాంత్‌లు నామినేషన్లు వేశారు. 8 వార్డు స్థానాలకు సింగిల్ డిజిట్ నామినేషన్లు దాఖలయ్యాయి. శనివారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉండటంతో బల్లెపు ప్రశాంత్, నీరటి బాబు తమ నామినేషన్లను విత్‌డ్రా చేసుకున్నారు. దీంతో సర్పంచ్ స్థానానికి జంగిటి అంజయ్య నామినేషన్ ఒక్కటే ఉండటంతోపాటు 8 వార్డు స్థానాలకు సింగిల్ డిజిట్ నామినేషన్లు రావడంతో కలెక్టర్ పరీశీలనకు పంపినట్లు ఎంపీడీవో లక్ష్మినారాయణ తెలిపారు. కలెక్టర్ అనుమతి రాగానే ఏకగ్రీవంగా ప్రకటించి, ఉపసర్పంచ్ ఎన్నిక సైతం నిర్వహిస్తామని పేర్కొన్నారు.