మహబూబ్‌నగర్ (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/నాగర్‌కర్నూల్, జూలై 28 : నాగర్‌కర్నూల్ జిల్లా ఉయ్యాలవాడ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కారణంగా 111 మందికిపైగా విద్యార్థినులు అస్వస్థతకు గురికాగా, సోమవారం మరో ముగ్గురు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో తోటి విద్యార్థినులు భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. ఆందోళనతో తల్లిదండ్రులు వారి బిడ్డలను సొంతూళ్లకు తీసుకెళ్తున్నారు. కొందరు విద్యార్థినులు తల్లిదండ్రులకు ఫోన్‌చేసి తమను గురుకులం నుంచి తీసుకెళ్లాలని ప్రాధేయపడటం కనిపించింది. ఉయ్యాలవాడ గురుకుల పాఠశాల, కళాశాలలో 743 మంది విద్యార్థినులు చదువుతున్నారు. ఈ ఘటనతో దాదాపు 400 మంది విద్యార్థులు ఊర్లకు వెళ్లిపోయినట్టు తెలిసింది. అధికారులు, మీడియా అక్కడ ఉండగానే చాలా మంది వెళ్లిపోవడం కనిపించింది.
ఉయ్యాలవాడ గురుకుల పాఠశాలను జూనియర్ కాలేజీగానూ అప్‌గ్రేడ్ చేశారు. కేసీఆర్ హయాంలో అన్ని వసతులతో గురుకుల పాఠశాలను నిర్మించారు. ప్రైవేట్ పాఠశాలను తలదన్నేలా వసతులు కల్పించారు. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ గురుకులాన్ని ఆదర్శంగా నిర్మించారు. రెండేండ్లుగా గురుకులంపై పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఇక్కడి సిబ్బంది ఆడింది ఆట.. పాడింది పాటగా మారింది. ఉన్నతాధికారులు కన్నెత్తి చూడకపోవడం విద్యార్థుల ప్రాణాల మీదికి తెచ్చింది. శనివారం రాత్రి వడ్డించిన ఉడికీ ఉడకని అన్నం, పప్పుచారు.. పకోడీ.. పులిసిన పెరుగు తినడం వల్ల 111 మంది విద్యార్థులకు వాంతులు, విరేచనాలు అయ్యాయి.
కడుపునొప్పి భరించలేక విద్యార్థినులు విలవిలలాడారు. తమ తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పడంతో వారంతా హుటాహుటిన చేరుకొని 108లో తమ పిల్లలను నాగర్‌కర్నూల్ దవాఖానకు తరలించాల్సి వచ్చింది. మాజీ మంత్రి హరీశ్‌రావు వచ్చి వెళ్లిన తర్వాత గురుకులాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు సందర్శించారు. విద్యార్థుల శవాలపై పేలాలు ఏరుకునే ప్రయత్నం అంటూ హరీశ్‌ను ఉద్దేశించి జూపల్లి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. మరోవైపు హరీశ్ వస్తున్నారని విద్యార్థులకు నయం కాకున్నా హుటాహుటిన డిశ్చార్జి చేయడం కూడా విమర్శలకు దారితీసింది.
ఘటనపై ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన మంత్రులు నామమాత్రంగా స్పందించడం విమర్శలకు తావిస్తున్నది. 3 నెలల కిందట నాగర్‌కర్నూల్ జిల్లాలోని ఓ పాఠశాలలో ఫుడ్‌పాయిజన్ కారణంగా విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటన మరువక ముందే పెద్దకొత్తపల్లిలో వారం కింద బీసీ బాలుర గురుకులంలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. తాజాగా ఉయ్యాలవాడ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.
అధికారుల పర్యవేక్షణ లేకనే ఉయ్యాలవాడ గురుకులంలో ఫుడ్ పాయిజన్ ఘటన జరిగిందని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ హయాంలో గురుకులాల పర్యవేక్షణకు ఐపీఎస్ అధికారిని నియమించామని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం గురుకులాలను భ్రష్టు పట్టిస్తున్నదని విమర్శించారు. కేసీఆర్‌కు పేరు వస్తుందనే అక్కసుతోనే వాటిని గాలికి వదిలేసిందని మండిపడ్డారు.
ఫుడ్ పాయిజన్ విషయాన్ని తెలుసుకొని హరీశ్‌రావు హుటాహుటిన నాగర్‌కర్నూల్ జిల్లాకు చేరుకొని విద్యార్థులను పరామర్శిస్తే గానీ అధికారుల్లో చలనం రాలేదు. అప్పటికప్పుడు పాఠశాల ఆవరణలో జిల్లా వైద్యశాఖ వైద్య శిబిరాన్ని ఏర్పాటుచేసింది. విద్యార్థులకు పరీక్షలు చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నది. ఘటనపై వివరాలు తెలుసుకునేందుకు ఆదివారం మీడియాకుఅనుమతి ఇవ్వని అధికారులు, సోమవారం అనుమతించారు. ఘటనకు కారణమైన క్యాటరింగ్ ఏజెన్సీపై వేటువేసి చేతులు దులుపుకొన్నారు. ప్రిన్సిపాల్ బదిలీకి సిద్ధమవుతున్నారు. సర్కారు నిర్లక్ష్యపు వైఖరితోనే ఇలా జరిగిందని మాజీ ఎమ్మెల్యే జనార్దన్‌రెడ్డి మండిపడ్డారు.