హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుకుగా ఉన్నాయని రాబోయే 3 రోజులు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గడిచిన 24 గంటల్లో మెదక్, సంగారెడ్డి, ఆదిలాబాద్, కామారెడ్డి, నిర్మల్ జిల్లాల్లో మోస్తరు వర్షం కురిసినట్టు పేర్కొన్నది. బుధవారం కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
రేపు మరో అల్పపీడనం
ఏపీకి మరో అల్పపీడనం ముప్పు తప్పదని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈనెల 5న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం క్రమేపీ బలపడే అవకాశం ఉందని తెలిపింది.భారీ వర్షాలు, వరదల వల్ల సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ఆయా మార్గాలలో బుధవారం వరకు రైళ్లను రద్దు చేసినట్టు రైల్వే అధికారులు తెలిపారు. మరికొన్ని రైళ్లను దారి మళ్లిస్తున్నారు.