వరంగల్ : జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్ బోల్తాపడి ఐదుగురు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. ఈ విషాదకర ఘటన ఖానాపురం మండలం అశోక్ నగర్ గ్రామ శివారులో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు..ఖానాపూరం మండలం పర్శా తండాకు చెందిన మహిళలు పెండ్లి బట్టల కోసం ట్రాక్టర్లో నర్సంపేట వెళ్తున్నారు. కాగా, అశోక్ నగర్ శివారులోని చెరువు కట్ట మీదుగా వెళ్తున్నక్రమంలో అదుపు తప్పి ట్రాక్టర్ బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మరణించారు. క్షతగాత్రులను వైద్య సహాయం కోసం దవాఖానకు తరలించారు. గాయపడ్డ మరో ఇద్దరు చికిత్స పొందుతూ మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులను గుగులోతు స్వామి (48), సీత (45), శాంతమ్మ (40), జాటోత్ గోవింద్( 65), జాటోత్ బుచ్చమ్మ(60)గా గుర్తించారు.