జడ్చర్ల: మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల (Jadcherla) మండలం మాచారం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మాచారం బ్రిడ్జిపై ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి వోల్వో బస్సు ఢీకొట్టింది. దీంతో బస్సు డ్రైవర్ సహా ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. పలువురు గాయపడ్డారు. ప్రమాదం ధాటికి బస్సు ముందు భాగం నుజ్జునుజ్జు అయింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. అతి కష్టంపై మృతదేహాలను వెలికితీశారు.
బస్సు కడప నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. బస్సు లారీలోకి దూసుకెళ్లడంతో డ్రైవర్ తల తెగి లారీపై పడింది. డ్రైవర్ వెనక కూర్చున్న ఇద్దరు మహిళలు కూడా మరణించారు. వారిని హైదరాబాద్ కూకట్పల్లికి చెందిన లక్ష్మీదేవీ, రాధికగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.