మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. జిల్లాలోని మరిపెడ మండలం కుడియాతండా సమీపంలో 563వ జాతీయ రహదారిపై రెండు లారీలు ఢీకొన్నాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో రెండు లారీలు దగ్ధమయ్యాయి. దీంతో ఇద్దరు డ్రైవర్లు, క్లీనర్ సజీవదహనమయ్యారు.
సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపుచేసేలోపే రెండు లారీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ప్రమాదానికి గురైన లారీల్లో ఒకటి గ్రానైట్ లోడుతో, మరొకటి చేపల దానాతో వెళ్తున్నాయని చెప్పారు. ఒకటి విజయవాడ నుంచి గుజరాత్ వెళ్తుండగా, మరోలారి వరంగల్ నుంచి ఆంధ్రవైపు వెళ్తున్నదని తెలిపారు. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు ఈ ప్రమాదం జరిగిందని వెల్లడించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉన్నదని వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.