 
                                                            Road Accident: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం గోపాలపురంలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. గోపాలపురం క్రాస్ రోడ్డు వద్ద జాతీయ రహదారిపై రోడ్డు పెండ్లి బృందంతో వెళ్తున్న బొలేరో వాహనాన్ని బోర్‌వెల్స్ లారీ ఢీకొట్టింది. దీంతో ముగ్గురు మృతి చెందగా, మరో 12 మంది గాయపడ్డారు.
మహబూబాబాద్ జిల్లా కురవి మండలం సూదన్పల్లికి చెందిన యువతిని, సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన యువకుడితో పెండ్లి జరిపించారు. వివాహ వేడుకల్లో భాగంగా వధువు తరుఫు బంధువులు వరుడి ఇంటికి వెళ్లారు. తిరిగి మహబూబాబాద్‌కు వెళ్తుండగా గోపాలపురం క్రాస్ రోడ్డు వద్ద బొలేరో వాహనాన్ని ఆపారు. దీంతో వెనుక నుంచి వచ్చిన లారీ దానిని ఢీకొట్టింది. ఘటనాస్థలంలో ఒకరు మృతిచెందగా, ఎంజీఎం దవాఖానలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మరణించారు. ప్రమాదం ధాటికి బొలేరో తుక్కుతుక్కు అయింది. గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం వారు వరంగల్‌లోని ఎంజీఎంలో చికిత్స పొందుతున్నారని తెలిపారు.
 
                            