హైదరాబాద్, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మూడు రోజులపాటు చలి విపరీతంగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించింది. తెలంగాణ రాష్ట్రంలో కిందిస్థాయి ఐఎండీ అధికారులు గాలులు తూర్పు – ఈశాన్య దిశ నుంచి వీచే అవకాశమున్నదని, ఈ ప్రభావంతో శుక్ర, శనివారాల్లో పొడి వాతావరణం ఏర్పడుతుందని ఐఎండీ అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
కొన్ని ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలు తకువగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. బుధవారం- గురువారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణీలో 6.9 డిగ్రీల సెల్సియస్, సంగారెడ్డి జిల్లా కోహీర్లో 7.4 డిగ్రీలు, రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో 8.5 డిగ్రీల చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వివరించారు. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్టు చెప్పారు. మిగిలిన 23 జిల్లాల్లో 10-12.8 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని, వాటికి ఎల్లో అలర్ట్ జారీచేశామని పేర్కొన్నారు.