కోరుట్ల/మేడిపల్లి, మే 20: మొక్కులు చెల్లించుకునేందుకు దైవదర్శనానికి వెళ్లిన ఆ కుటుంబాన్ని విధి వెక్కిరించింది. అభం శుభం తెలియని ముగ్గురు చిన్నారులను కోనేరు బలిగొన్నది. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం కొండాపూర్‌లో జరిగిన విషాద ఘటన రెండు కుటుంబాల్లో తీరని వేదన మిగిల్చింది. కొండాపూర్‌కు చెందిన వడ్లగట్ట శేఖర్, భార్గవి దంపతులకు కొడుకు శర్వాంద్శివ (7) ఉన్నాడు. శేఖర్ కోరుట్ల పట్టణంలోని ఓ డిష్ కేబుల్ ఆపరేటర్‌గా పని చేస్తుండగా, భార్గవి పట్టణంలోని రామకృష్ణ డిగ్రీ కాలేజీలో లెక్చరర్. భార్గవి ఇటీవల గర్భం దాల్చడంతో కొండాపూర్ శివారులో గంగమ్మ తల్లి(శివగంగ)కి తెప్ప మొక్కులు తీర్చుకునేందుకు కుటుంబసభ్యులతో కలిసి బుధవారం వెళ్లారు. తమతోపాటు జగిత్యాలలో నివాసం ఉంటున్న తన అక్క, బావ భారతి-నాగభూషణం దంపతులనూ శుభకార్యానికి పిలిచింది. వారు తమ పిల్లలు మన్విత్సాయి (13), మనస్విని (11)తో కలిసి శివగంగకు వచ్చారు. వంటలు చేసుకొని భోజనాలు చేసిన తర్వాత అందరూ కలిసి సంతోషంగా గడిపారు.
చిన్నారులు ఆడుకుంటామని చెప్పి దగ్గరలో ఉన్న కోనేరు వద్దకు వెళ్లి అందులో పడి మునిగిపోయారు. కుటుంబసభ్యులు పిల్లల కోసం వెతగ్గా కోనేరులో విగతజీవులుగా కనిపించారు. వెంటనే బయటకు తీసిన కుటుంబసభ్యులు సీపీఆర్ చేసినా చిన్నారుల ప్రాణాలు దక్కలేదు. పది నిమిషాల వ్యవధిలో అంతా జరిగిపోయిందని కుటుంబసభ్యులు రోదించారు. శర్వాంద్శివ కోరుట్ల పబ్లిక్ స్కూల్లో రెండో తరగతి చదువుతున్నాడు. అన్నాచెల్లెలు మన్విత్ సాయి, మనస్విని జగిత్యాలలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 7, 6 తరగతులు చదువుతున్నారు. వీరి తల్లిదండ్రులు నాగభూషణం- భారతీ దంపతులు జగిత్యాలలో ఓ షాపింగ్ మాల్లో పనిచేస్తున్నారు. పిల్లలు లేని జీవితం తమకెందుకని కుటుంబసభ్యులు రోదించిన తీరు అక్కడున్నవారిని కంటతడి పెట్టించింది. ఘటనాస్థలాన్ని కోరుట్ల సీఐ లక్ష్మీనారాయణ పరిశీలించారు. మృతుల బంధువుల ఫిర్యాదుమేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీధర్‌రెడ్డి తెలిపారు.