Karimnagar | కరీంనగర్ (Karimnagar) జిల్లా కేంద్రంలో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. మానేరు వంతెన (Manier) డంప్ యార్డ్ సమీపంలో వాగులో నీటిలో గుంతలో పడి ముగ్గురు బాలురు మృతి చెందారు. సంఘటనా స్థలంలో మరో బాలుడు గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చేపట్టారు. వాగులో నుంచి ముగ్గురు బాలుర మృతదేహాలను వెలికి తీశారు. మృతులను కరీంనగర్ హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన భవన నిర్మాణ కూలీలకు చెందిన పిల్లలు వీరాంజనేయులు (12), అనిల్ (13), సంతోష్ (14)గా గుర్తించారు.
హోలీ పండుగ సందర్భంగా రంగులతో ఆడుకున్న వీరంతా.. ఆ తర్వాత ఈత కొట్టేందుకు డంప్‌యార్డ్‌కు దగ్గరలో ఉన్న నీటి గుంత వద్దకు వెళ్లారు. అందులోకి దిగి స్నానం చేసేందుకు ప్రయత్నించగా.. ఈత రాకపోవడంతో మునిగిపోయి చనిపోయి ఉంటారని కరీంనగర్ రూరల్ ఏసీపీ కరుణాకర్‌రావు తెలిపారు. మృతుల కుటుంబాలు కరీంనగర్‌లోని హౌసింగ్ బోర్డు కాలనీతో పాటు మానేరు రివర్ ఫ్రంట్ పనులు జరుగుతున్న ప్రాంతంలో మేస్త్రీ పనులు చేసుకుంటున్నట్లుగా తెలిపారు. మృతుల స్వగ్రామం ఒంగోలు జిల్లా చింతకాని గా పోలీసులు వివరించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.