గీసుగొండ, డిసెంబర్ 10 : వేములవాడ రాజన్న కోడెలను సొసైటీ పేరుతో తెచ్చి విక్రయించిన ముగ్గురిని అరెస్టుచేసి రిమాండ్కు తరలించారు. సీఐ మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా గీసుగొండ మండలం మనుగొండకు చెందిన మాదాసి రాంబాబు రాజన్న కోడెలను తెచ్చి కబేళాలకు తరలిస్తున్నట్టు గత నెల 29 వెలగందుల రాజు ఫిర్యాదు చేశాడు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు ఈ నెల 1న రాంబాబుపై కేసు నమోదు చేశారు. రాజన్న ఆలయ ఈవోకు ఈ నెల 3న గీసుగొండ ఎస్సై కుమార్ నోటీసు ఇవ్వగా అనంతారం గ్రామానికి చెందిన మంద స్వామి, దుగ్గొండి మండలం చలపర్తికి చెందిన పసునూటి శ్యామ్సుందర్కు కోడెలు ఇచ్చామని ఈవో కార్యాలయం తెలిపింది. రాంబాబు, మంద స్వామి, శ్యామ్సుందర్ అధికారులతో కుమ్మక్కై రైతుల సంతకాలుపెట్టి రెండు దఫాలుగా 66 లేగదూడలు, కోడెలు తీసుకొచ్చి గట్టుకిందిపల్లి పాకలో ఉంచినట్టు తేలింది. అందులో 28 కోడెలను అమ్ముకోగా, 26 కోడెలను తిరిగి వేములవాడ రాజన్న గోశాలకు అప్పగించారని, మరో 3 కోడెలు చనిపోగా, రాంబాబు వద్ద ఉన్న 9 కోడెలను మంగళవారం స్వాధీనం చేసుకొని ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
వెలుగులోకి తెచ్చిన నమస్తే తెలంగాణ
ఈ నెల 7న నమస్తే తెలంగాణ దినపత్రిక మెయిన్ ఎడిషన్లో ‘రాజన్న కోడెలు కోతకు’ శీర్షికన కథనం ప్రచురితమవడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మంత్రి పేరు తెరపైకి రావడం అనేక అనుమానాలకు తావిచ్చింది. గీసుగొండ పోలీసులు విచారణచేపట్టారు. రాజన్న కోడెలు కబేళాలకు తరలింపుపై రాజన్న ఆలయంలో బీఆర్ఎస్, బీజేపీ నాయకులు రాస్తారోకో చేపట్టడంతో అక్కడి అధికారులు ఈ వ్యవహారంపై దృష్టిపెట్టారు. 5న గీసుగొండలో పోలీస్ష్టేషన్లో కేసు నమోదైనట్టు నమస్తే తెలంగాణలో వార్త ప్రచురితం కావడంతో గీసుగొండలో ఈ వార్త చర్చనీయాశంగా మారింది.
ఐదేండ్లుగా నడుస్తున్న విక్రయ వ్యవహారం
ఐదేళ్ల క్రితం అనంతారం గ్రామానికి చెందిన మంద స్వామి, మాదాసి రాంబాబు కలిసి గ్రామంలో గోశాలను ఏర్పాటు చేశారు. వేములవాడ, యాదాద్రి నుంచి కోడెలు తెచ్చి విక్రయిస్తుండగా బీజేపీ నాయకులు జాన్విక్రమ్, ముల్క ప్రసాద్, విశ్వహిందూ పరిషత్ రాజు అడ్డుకోవడంతో గోశాలను మూసివేశారు. రాంబాబు అతడి పేరుతో పాటు తన కుటుంబ సభ్యుల పేర్లను సభ్యులుగా చేస్తూ శ్రీ రాజశ్వర సొసైటీని రిజిస్టర్ చేసుకున్నాడు. సొసైటీ పేరుతో 8 నెలలుగా పలు ఆలయాల నుంచి కోడెలను తెచ్చి మనుగొండ శివారు గట్టుకిందిపల్లిలోని డీబీఎం-38 ఉప కాల్వ భూమిలో చిన్న పాక వేసి సంరక్షణ పేరుతో తెచ్చిన కోడెలను కబేళాలకు విక్రయిస్తున్నాడు. ఆలయం నుంచి 60 కోడెలు తెచ్చింది వాస్తవమేనని, అందులో కొన్ని పారిపోయాయని, మరికొన్ని చనిపోయాయని, 26 కోడెలు తిరిగి ఆలయానికి ఇచ్చానని మిగిలిన 11 తన వద్ద ఉన్నాయని రాంబాబు పొంతన లేని సమాధానాలు చెబుతూవచ్చాడు.
విచారణలో పలు విషయాలు బయటకు..
పోలీసులు మాదాసి రాంబాబు కుటుంబ నేపథ్యంపై ఆరా తీయగా మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాంబాబుది మొదటినుంచీ అక్రమ వ్యాపారాలు చేస్తూ డబ్బు సంపాదించాలనే స్వభావం. ప్రజాప్రతినిధుల పేర్లను అడ్డుపెట్టుకొని అనేక ఆలయాల నుంచి కోడెలు, ఆవులను తెచ్చి కబేళాలకు విక్రయించే వాడని గ్రామస్తులు చెబుతున్నారు. ఫేక్ సొసైటీ పేరుతో దందాలు చేస్తూ పోలీసులకు చిక్కాడు.
కోడెల విక్రయంపై పంచనామా
రాజన్న కోడెల విక్రయంపై గీసుగొండ పోలీసులు, రెవెన్యూ, మండల పరిషత్ అధికారులు మంగళవారం మనుగొండ శివారులోని గట్టుకిందిపల్లి రాంబాబు పాక వద్దకు వెళ్లి పంచనామా చేశారు. కోడెల చెవులకు ఉన్న ట్యాగులు పరిశీలించారు. పదకొండింటిలో కొన్నింటికి మాత్రమే ట్యాగులు ఉన్నాయని మిగతావాటికి లేవని అధికారులు పేర్కొన్నారు.