సిద్దిపేట, ఆక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘మేము అడిగినంత ఇవ్వండి. లేదంటే మీ ఇల్లు రోడ్డు విస్తరణలో పోతుంది. మీ ఇంటి మీదికి బుల్డోజర్ వస్తుంది జాగ్రత’ అంటూ సిద్దిపేట జిల్లాలో పలువురికి బెదిరింపు కాల్స్ వస్తున్నాయట. ‘రేవంత్‌రెడ్డి ఫోర్స్ సిద్దిపేట’ పేరుతో రెండు రోజులుగా కాల్స్ చేస్తూ హల్చల్ చేస్తున్నారని కాంగ్రెస్ వర్గాలే ఆరోపిస్తున్నాయి. సిద్దిపేట పట్టణంతోపాటు జిల్లాలోని ఇతర ప్రాంతాలకు చెందినవారికి ఫోన్లు చేసి వసూళ్లకు పాల్పడుతున్నారని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఇదంతా జిల్లా కాంగ్రెస్‌కు చెందిన ఓ అధికారిక వాట్సాప్ గ్రూప్‌లో పోస్ట్ చేశారని సమాచారం. ఈ అంశంపై నేతల మధ్య పెద్ద ఎత్తున చర్చ జరిగినట్టు తెలుస్తున్నది. ఇప్పటికే మన పార్టీ లీడర్లు ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారని, ఇప్పుడు కొత్తగా ‘రేవంత్‌రెడ్డి ఫోర్స్ సిద్దిపేట’ పేరుతో డబ్బులు వసూలు చేయడం ఏమిటని ప్రశ్నించినట్టు తెలిసింది. ఇదేం పద్ధతి? ఇది మన పార్టీకి మంచిదేనా? అని ఆగ్రహం వ్యక్తంచేసినట్టు సమాచారం.
ఇప్పటికే ఇందిరమ్మ ఇండ్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ తదితర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు కాంగ్రెస్ నేతలు ఫోన్లు చేసి వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాగానే ఫోన్ చేస్తున్నారని, డబ్బులు ఇవ్వకపోతే ఇల్లును రద్దు చేయిస్తామని బెదిరిస్తున్నారని అంటున్నారు. మొదటి దశ బిల్లు రాగానే, కొందరు నేతలు లబ్ధిదారుల ఇండ్లకు వెళ్లి తామే చేయించామంటూ అందినకాడికి దోచుకుంటున్నారని కాంగ్రెస్ శ్రేణులే ఆరోపిస్తున్నాయి. ‘ప్రభుత్వం మాది. మేము చెప్తే అదే జరుగుతుంది. డబ్బులు ఇవ్వకపోతే తస్మాత్ జాగ్రత’ అంటూ బెదిరిస్తున్నారని పేర్కొంటున్నారు. దీంతో ‘వచ్చే బిల్లు ఇల్లు కట్టడానికే సరిపోవడం లేదు. పైగా ఇలా వసూళ్లకు పాల్పడితే ఇల్లు కట్టుకోవడం ఎందుకు?’ అంటూ లబ్ధిదారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారని, దీనికి తోడు ఇప్పుడు ‘రేవంత్‌రెడ్డి ఫోర్స్ సిద్దిపేట’ పేరుతో వసూళ్లకు తెగబడటం ఏమిటని ప్రశ్నిస్తున్నారట.
‘ఫోర్స్’ వెనుక ఎవరు?
బెదిరింపు కాల్స్ వచ్చిన ఫోన్ నంబర్లను పరిశీలించగా ట్రూ కాలర్‌లో ‘రేవంత్‌రెడ్డి ఫోర్స్ సిద్దిపేట’ అని వస్తున్నదట. దీంతో ఈ ‘రేవంత్‌రెడ్డి ఫోర్స్ సిద్దిపేట’ వెనుక ఎవరున్నారనే చర్చ జరుగుతున్నది. వీరికి కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది సీనియర్ నేతల అండదండలు ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే.. ఈ పరిణామాలపై మరికొంత మంది సీనియర్ కాంగ్రెస్ నేతలు గుర్రుగా ఉన్నట్టు తెలుస్తున్నది. పార్టీ పరువును తీస్తున్నారంటూ తప్పుబడుతున్నారట. ఒక వర్గంపై మరో వర్గం పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నట్టు తెలిసింది. ‘ఫోర్స్ వెనుక మీ నాయకుడు ఉన్నాడంటే, కాదు మీ నాయకుడే ఉన్నాడ’ంటూ’ ఒకరి మీద ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నట్టు తెలిసింది. మొత్తంగా సీనియర్ కాంగ్రెస్ నాయకులే ఈ ముఠా వెనుక ఉన్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు.
అధికారులకు సైతం తప్పని బెదరింపులు
జిల్లాలో కాంగ్రెస్ నేతలు అధికారులను వేధిస్తున్నారే ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఇటీవలే ఓ మండలాధికారి తాను ఇక్కడ పని చేయలేనని, బదిలీ చేయాలని జిల్లా కలెక్టర్‌కు మొరపెట్టుకున్నారని సమాచారం. 20 మందికిపైగా కాంగ్రెస్ పార్టీ నేతలు వచ్చి తన విధులకు ఆటంకం కలిగిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారని తెలిసింది. ఆయన మొబైల్ ఫోన్‌ను బలవంతంగా గుంజుకొని మానసికంగా ఇబ్బంది పెట్టారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. జిల్లాలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో ఇదే పరిస్థితి. కాంగ్రెస్ నాయకులు గంటలపాటు తిష్ట వేస్తున్నారని, ప్రతి ఫైల్‌నూ చూస్తూ, అక్కడే పైరవీలు చేస్తున్నారని అధికారులు వాపోతున్నారు. ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల జాబితాలను తమకు అనుకూలంగా తయారు చేయిస్తున్నారని ఆరోపిస్తున్నారు. అలా కాదని ఎవరైనా అధికారులు ఎదురు చెప్తే వేధింపులకు గురిచేస్తున్నారని, ‘ప్రభుత్వం మాది. మేము చెప్పినట్టే నడుచుకోవాల్సిందే’ అని హుకూం జారీ చేసి ఫైల్‌ను సిద్ధం చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. దీంతో మండలాల్లో పనిచేస్తున్న అధికారులు హడలిపోతున్నారు. అటు నష్టపోయిన అర్హులకు సర్దిచెప్పలేక, ఇటు నేతలకు తలొగ్గలేక మానసికంగా ఇబ్బంది పడుతున్నారు.