హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ): మున్ముందు తుంగభద్ర పరవళ్లు ఉండవా.. కృష్ణమ్మ ఉరుకులు ఇక కనబడవా? ఫలితంగా దక్షిణ తెలంగాణకు ముప్పు పొంచి ఉన్నదా? అంటే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ర్టాలు రచిస్తున్న ప్రణాళికలు అమలైతే అదే జరుగుతుంది. దిగువ జూరాల పడావు పడక తప్పదు. శ్రీశైలం ఎల్లకాలం ఎండుడూ తప్పదు. కృష్ణా నదికి తుంగ, భద్ర ఉపనదులు. ఆ రెండింటి నుంచే ఏటా దాదాపు 500 టీఎంసీల మేరకు జలాలు కృష్ణా నదిలో కలుస్తుంటాయి. ఈ నేపథ్యంలోనే బచావత్ ట్రిబ్యునల్ తుంగభద్ర నదిపై ఎక్కడ పడితే అక్కడ, ఎలాపడితే అలా ప్రాజెక్టులు నిర్మించకుండా అనేక ఆంక్షలు విధించింది. షరతులు కూడా పెట్టింది. కానీ కర్ణాటక సర్కార్ ఇప్పటికే ఆ నిబంధనలను తుంగలోకి తొక్కుతూ అనేక నిర్మాణాలు చేపడుతున్నది. ఇప్పటికే అరకొరగానే జలాలు వచ్చే భీమా నదిపై బరాజ్‌ల నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నది.
ఇక ఏపీ సైతం వరదజలాల పేరిటే ప్రాజెక్టులు చేపడుతామని పేర్కొంటూ ఆ తర్వాత అనేక కుట్రలకు తెరలేపింది. ప్రస్తుతం ఆ రెండు రాష్ర్టాలు చేస్తున్న ప్రణాళికలు అమలైతే భవిష్యత్తులో తుంగభద్ర నుంచి కృష్ణా నదిలోకి వచ్చే జలాలు పూర్తిగా తగ్గిపోతాయి. దిగువ ప్రాజెక్టులకు నీళ్లు రాకుండా పోతాయి. అంతిమంగా భవిష్యత్తులో ప్రస్తుతం వస్తున్న ఆ కొద్ది నదీజలాలు తెలంగాణకు దక్కకుండా పోయే ప్రమాదం పొంచి ఉన్నది. బాబు కోసం రేవంత్ సర్కార్ సైతం సదరు ప్రణాళికలకు సై అంటున్నది. ఒప్పందాలకు సిద్ధమవుతున్నది. దక్షిణ తెలంగాణను ఉరివేయ పూనుకున్నది.
230 టీఎంసీల నీటిని వినియోగించుకొనే లక్ష్యంతో తుంగభద్ర డ్యామ్ నిర్మించారు. ఆ డ్యామ్‌లో పూడిక పెరుగడం, వరద ప్రవాహాల్లో వచ్చిన మార్పుల ఫలితంగా ప్రస్తుతం 174.72 టీఎంసీలను వినియోగించుకొనే పరిస్థితే ఉన్నదని, 55.28 టీఎంసీలను నష్టపోవాల్సి వస్తున్నదని కర్ణాటక చెప్తున్నది. దానినే సాకుగా చూపి తుంగభద్ర లోలెవల్ కెనాల్ (ఎల్ఎల్సీ)కి సమాంతరంగా మరో కాలువను తవ్వేందుకు ఆ రాష్ట్ర సర్కార్ సిద్ధమైంది. కొప్పల్ జిల్లా గంగావతి తాలుకాలో ఇప్పటికే 31 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన నావలి రిజర్వాయర్‌ను 52 టీఎంసీలకు విస్తరించి తుంగభద్ర డ్యామ్‌కు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌గా వినియోగించుకొనేందుకు ప్రతిపాదనలు సిద్ధంచేసింది. ప్రాజెక్టును ఎట్టిపరిస్థితుల్లోనూ చేపడుతామంటూ ఆ దిశగా ప్రస్తుతం వేగంగా అడుగులు వేస్తున్నది.
తుంగభద్ర డ్యామ్ హైలెవల్ కెనాల్ మొత్తం పొడవు 189 కి.మీ. కర్ణాటక రాష్ట్రంలో 105 కి.మీ వరకు, అక్కడి నుంచి 189 కి.మీ. వరకు ఏపీ రాష్ట్రం అనంతపురం జిల్లా గుండా పోతుంది. ఆ కాలువ నుంచి ఆ జిల్లాలోని మిడ్ పెన్నార్ రిజర్వాయర్, పెన్నార్ అహోబిలం రిజర్వాయర్లు కూడా ఉన్నాయి. ఈ హెచ్ఎల్సీ ద్వారా ఏపీకి 32 టీఎంసీల జలాల కేటాయింపులు ఉన్నాయి. ఇదిలా ఉంటే కేవలం కృష్ణాకు వరదలు వచ్చిన క్రమంలో వాటిని తక్కువ సమయంలోనే తరలించి అనంతపురం జిల్లాకు అందిస్తామని చెబుతూ ఏపీ సర్కార్ కుట్రకు తెరతీసింది. అందులో భాగంగా హెచ్ఎల్సీ కెనాల్‌కు సమాంతరంగా మరో కాలువను తవ్వేందుకు ప్రణాళికలను రూపొందించడమే కాదు ఏపీలో కొలువైన టీడీపీ సర్కార్ ఆ ప్రణాళికలను శరవేగంగా ముందుకు తీసుకుపోతున్నది. అందుకు కర్ణాటక కూడా అంగీకారం తెలిపేందుకు సిద్ధంగా ఉన్నది.
బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ కర్ణాటక ప్రతిపాదించిన యూకేపీ ఆల్మట్టి ఫేజ్-3 (అప్పర్ కృష్ణా ప్రాజెక్టు)కి 130 టీఎంసీలు కేటాయించింది. ఆ జలాల వినియోగానికి ఆల్మట్టి ఎత్తును 519.6 మీటర్ల నుంచి 524.256 మీటర్లకు పెంచుకొనేందుకు అనుమతిచ్చింది. తద్వారా ఆల్మట్టి ప్రస్తుత నీటిమట్టం 123.08 టీఎంసీలకు అదనంగా మరో 100 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. అయితే ట్రిబ్యునల్ అవార్డు ఇప్పటికీ అమలులోకి రాలేదు. పెండింగ్‌లోనే ఉన్నది. కానీ, అవార్డు అమల్లోకి రాకముందే ఆల్మట్టి ఎత్తుపెంపును చేపట్టేందుకు కర్ణాటక సిద్ధమైంది. ఎత్తు పెంచి నీటినిల్వ సామర్థ్యం పెంపునకు దాదాపు 1.33 లక్షల ఎకరాల భూమిని సేకరించాల్సి ఉన్నది. అందుకు రూ.70 వేల కోట్ల మేరకు అవసరమవుతాయని అంచనా వేయడంతోపాటు, ఆ ప్రతిపాదనలకు కర్ణాటక ప్రభుత్వం ఇటీవలే ఆమోదం తెలిపింది. అంతేకాదు ఏటా భూసేకరణకు రూ.15 వేల నుంచి రూ.20 వేల కోట్లను వెచ్చించేందుకు నిర్ణయించింది. అవార్డును పాక్షికంగా అమలు చేసేలా చూడాలని కేంద్రంపైనా ఒత్తిడి పెంచుతున్నది.
కర్ణాటక రాష్ట్రంలో వివిధ నీటి ప్రాజెక్టులు, బరాజ్‌ల నిర్మాణాలకు వడివడిగా సిద్ధపడుతుంటే.. తెలంగాణలోని రేవంత్ సర్కార్ దిక్కులు చూస్తున్నది. కర్ణాటక ప్రభుత్వం నారాయణపూర్ స్పిల్‌వేకు దిగువన కొల్పూర్ వద్ద 1 టీఎంసీ నీటి నిల్వ సామర్థ్యంతో బరాజ్‌ను ప్రతిపాదించగా, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సైతం సూత్రప్రాయంగా అంగీకారం తెలుపుతున్నారు. కృష్ణా, భీమా నదులు కలిసే తంగిడికి ఎగువన భీమా నదిపై కుసుమూర్తి గ్రామం వద్ద తెలంగాణతో కలిసి సంయుక్తంగా బరాజ్ నిర్మాణానికి కర్ణాటక తాజాగా ప్రతిపాదనలు సిద్ధం చేసింది. సంప్రదింపులు కొనసాగుతున్నాయి.
అదే భీమా నదిపై రాయచూర్ గుర్జాపూర్ గ్రామ సమీపంలో బరాజ్ నిర్మాణానికి ప్రతిపాదనల దశలో ఉన్నది. భీమా నదిపై హర్యాల్ వద్ద బ్రిడ్జి కమ్ బరాజ్ నిర్మాణానికీ కర్ణాటక సర్కార్ టెండర్‌ను సైతం జారీ చేసింది. భీమా నదిపైనే కలబురిగి జిల్లాలో 3.6 టీఎంసీల నీటినిల్వ సామర్థ్యంతో మరో బరాజ్ నిర్మాణానికి కర్ణాటక ప్రభుత్వం సిద్ధమైంది. తుంగభద్రా నదిపై చిక్కాలపర్వి వద్ద బరాజ్ నిర్మాణానికి కర్ణాటక ప్రతిపాదనలకు కేంద్రం సైతం ఆమోదం తెలిపింది.