హైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ)/మల్యాల : కొండగట్టు అంజన్న సేవా సమితి ఆధ్వర్యంలో ఈ నెల 16 నుంచి 40 రోజుల పాటు హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహిస్తున్నామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. తెలంగాణ ప్రజలు శాంతి, సౌభాగ్యాలతో సుభిక్షంగా ఉండాలనే ఆకాంక్షతో జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో ఈ బృహత్తర కార్యక్రమం చేపట్టినట్టు ఆమె పేర్కొన్నారు.
కొండగట్టు అంజన్న దర్శనానికి రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ర్టాల నుంచి దీక్షాపరులు వేలాదిగా తరలివస్తున్నారు. శనివారం అంజన్న చిన్న జయంతి సందర్భంగా మాల విరమణ చేస్తే మంచి జరుగుతదని దీక్షాపరులు విశ్వసిస్తుంటారు. దాంతో వీరంతా నేడు మాల విరమణ చేసి స్వామి వారిని దర్శించుకొంటారు. భక్తులకు ఎలాంటి ఇబ్బదులు తలెత్తకుండా దేవాదాయ శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. వేములవాడ ఆర్టీసీ డిపో నుంచి నాలుగు మినీ బస్సులను కొండగట్టుకు నడిపిస్తున్నారు.