పెద్దపల్లి, నవంబర్14: బీజేపీలో నిబద్ధతతో కష్టపడ్డవారికి గుర్తింపులేదని, సిద్ధాంతా లు తెలియని వా రికే అధినాయకత్వం పెద్దపీట వేస్తున్నదని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే, బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు గుజ్జుల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. అధిష్ఠానంపై అసంతృప్తితో ఉన్న బీజేపీ పెద్దపల్లి మండల అధ్యక్షులు, ముఖ్య నాయకుల తో కలిసి గుజ్జుల రామకృష్ణారెడ్డి మంగళవారం మీడియాతో మాట్లాడారు. సిద్ధాంతాల గురించి అవగాహనలేని వారికి టికెట్ ఇచ్చిందని మండిపడ్డారు. కొత్తగా చేరిన ఈటల రాజేందర్ లాంటి వారికి టికెట్ ఇచ్చి, పాత నాయకులను అవమానపరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తగా వచ్చిన వారు టికెట్ ఇస్తారా? లేదా? అని బ్లాక్ మెయిల్ చేస్తే పార్టీ బీ ఫాం ఇచ్చినట్టు ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ సిద్ధ్దాంతాల కోసం కట్టుబడి పనిచేసిన వారిలో 20 మందికి కూడా బీజేపీ టికెట్ ఇవ్వలేదని ఆరోపించారు. బీజేపీ నుంచి పెద్దపల్లి ఎమ్మెల్యేగా పని చేసిన తనకు సమాచారం లేకుండా మరొకరికి టికెట్ ఇచ్చారని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్ర నాయకత్వం అనాలోచిత నిర్ణయాలతో పార్టీ నష్టపోతుందని హెచ్చరించారు.