కరీంనగర్ : మానవ జన్మను పరుల సేవ కోసం ఉపయోగించినప్పుడే పుట్టుకకు సార్థకత వస్తుందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. కరీంనగర్ జిల్లా రేకుర్తిలోని బధిర ఆశ్రమ పాఠశాలలో 1981 నుంచి 2022 వరకు చదువుకున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా కొప్పుల ఈశ్వర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంగ వైకల్యంతో పుట్టిన వాళ్లు బధిరులు కాదని.. మనస్సులో ఇతరుల చెడును కోరుకునే వారే అసలైన బధిరులు అని అన్నారు. పుట్టుకతోనే అంగవైకల్యంతో పుట్టడం చాలా బాధాకరమని.. వారంతా దైవ సమానులని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు.
పాఠశాలలో నెలకొన్న సమస్యలను ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్.. విద్యార్థులు, ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. బధిర విద్యార్థులకు ఇంటర్ కాలేజీ ఏర్పాటు కోసం సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి కేక్ కట్ చేసి బధిర విద్యార్థులకు తినిపించారు.