ములుగు: ‘నేను తోపుడు బండిని.. నా ధర రూ.8వేలు.. మన గ్రామంలో మంచి మనసున్న దాతలు ముందుకు వస్తే మన గ్రామ పంచాయతీకి వెళ్లి సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాను’ అనే ఫ్లెక్సీని ములుగు జిల్లా వెంకటాపురం(ఎం)లో (Venkatapuram) వెలసింది. దీనిని స్వయంగా పంచాయతీ కార్యదర్శి ఏర్పాటు చేయడం గ్రామపంచాయతీల్లో నిధుల లేమికి అద్దంపడుతున్నది.
వెంకటాపురం (ఎం) గ్రామ కార్యదర్శి చందూలాల్ గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు ఫ్లెక్సీని స్వయంగా కట్టారు. అంతటితో ఆగకుండా మండల కేంద్రంలోని పలు కూడళ్లలో కూడా సిబ్బందితో ఫ్లెక్సీలను ఏర్పాటుచేసి వాట్సాప్ గ్రూప్‌లో సైతం ఫొటోలు అప్లోడ్ చేశారు. దీంతో ఓ పంచాయతీ కార్యదర్శి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిధులు లేవంటూ ఫ్లె క్సీలు కట్టడం జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. గ్రామ పంచాయతీలో తోపుడు బండి కొనేందుకు రూ.8 వేలు కూడా లేవా అంటూ సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క సొంత నియోజకవర్గం, అదీ ఆమె సొంత శాఖలోనే నిధులు లేవా అంటూ విపక్షాలు మండిపడుతున్నాయి.