హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం ఈ సారి లక్ష మందికిపైగా భద్రతా సిబ్బందిని వినియోగించనున్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ర్టానికి వందకు పైగా కేంద్ర బలగాలు రాగా.. మిగిలిన బలగాలు నేడో రేపో వచ్చే అవకాశం ఉంది. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో అక్కడి సిబ్బందిని తెలంగాణకు రప్పించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికలకు ఈసారి 375 కంపెనీలను వినియోగిస్తున్నారు. ఒక్కో కంపెనీకి 60-80 మంది చొప్పున సుమారు 25 వేల మంది ఉంటారు.
గత ఎన్నికల కోసం పొరుగు రాష్ర్టాల నుంచి మొత్తం 18 వేల మందికిపైగా పోలీసులను బందోబస్తు తీసుకున్నారు. ఈసారి ఆ సంఖ్యను 25 వేలకు పెంచారు. వీరిలో హోంగార్డు నుంచి, కానిస్టేబుల్ స్థాయి అధికారులు, వారిని ముందుండి నడిపించే ఎస్పీ స్థాయి అధికారులు సైతం తెలంగాణకు రానున్నారు. వీరికి తోడు రాష్ట్రంలో ఉన్న 65 వేలకు పైగా ఉన్న పోలీసులు, 18 వేల మందికిపై హోంగార్డు సిబ్బందిని మొత్తం కలిపి 50 నుంచి 60 వేల వరకు తెలంగాణ పోలీసుల శాఖ ఎన్నికల విధుల్లోకి తీసుకోనున్నది. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం కేంద్ర బలగాలు, పొరుగు రాష్ర్టాల సిబ్బంది, మన పోలీసుల మొత్తం కలిపి సుమారు లక్ష మందికిపైగా భద్రతతో ఎన్నికలను నిర్వహించనున్నారు.