BJP | హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లో హైడ్రా చేపడుతున్న కూల్చివేతలు బీజేపీలో అంతర్యుద్ధానికి కారమయ్యాయి. సఖ్యతగా ఉండే ఇద్దరు ఎంపీల మధ్య ఇది విభేదాలకు కారణమైంది. ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సహా కూల్చివేతలపై వారు పరస్పర విరుద్ధంగా చేస్తున్న వ్యాఖ్యలు బీజేపీలోని అంతర్యుద్ధాన్ని కండ్లకు కడుతున్నాయి. కేంద్రమంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్‌రెడ్డి, బండి సంజయ్ మధ్య ఇప్పటికే విభేదాలు పొడసూపగా, ఇప్పుడు ఎంపీలు ఈటల రాజేందర్, రఘునందన్‌రావు ఆ జాబితాలో చేరారు. వీరిద్దరి మధ్య సఖ్యత ఉన్నట్టు బయటకు కనిపిస్తున్నప్పటికీ వారి వైఖరి మాత్రం అనుమానాలకు తావిస్తున్నది.
‘రాష్ట్రం ఏమైనా నీజాగీరా? నువ్వెట్ల కూలగొడ్తవ్?’ అని కూల్చివేతల వ్యవహారంలో సీఎం రేవంత్‌రెడ్డిపై ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘హీరోలా పోజులు కొట్టడం మంచిది కాదు. కూల్చివేతలతో ప్రజలను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నవ్’ అని ఫైరయ్యారు. అంతేకాదు, ‘కాంగ్రెస్ పార్టీ 30, 40 ఏండ్ల క్రితం అధికారంలో ఉన్నప్పుడు పట్టాలు ఇచ్చిన భూమి ఎఫ్టీఎల్ భూమి అని తెల్వదా? ఇప్పుడెట్లా కూలగొడ్తావ్’ అని నిలదీశారు. హైడ్రాను అడ్డంపెటుకుని నువ్వు చేస్తున్న దంతా గురించి తాను మాట్లాడబోనని కానీ, ఆ పేరుతో పేదల జోలికి వెళ్తే మాత్రం ఊరుకునేది లేదని హెచ్చరించారు.
కాంగ్రెస్‌కు అనుకూలంగా రఘునందన్‌రావు
ఈటల రాజేందర్ హైడ్రాను ఏకపక్షంగా వ్యతిరేకిస్తే.. ఎంపీ రఘునందన్‌రావు మాత్రం అందుకు విరుద్ధంగా స్పందించారు. కూల్చివేతలు తప్పుకాదన్నట్టుగా మాట్లాడారు. ఎప్పుడో కూల్చాల్సిందని, ఇప్పటికే ఆలస్యమైనట్టుగా చెప్పుకొచ్చారు. హైకోర్టు స్టే ఆదేశాలపైనా స్పందించారు. రాష్ట్ర బీజేపీలో ఇద్దరు కీలక నేతలుగా ఉన్న ఎంపీలు ఇలా పరస్పర విరుద్ధంగా మాట్లాడి ప్రజలను గందరగోళ పరుస్తుండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. పార్టీలో ఆధిపత్య పోరుకు ఇది నిదర్శనమని చెప్తున్నారు. ఆయా వర్గాల నేతల రహస్య సమావేశాల్లో జరిగిన చర్చలు, నిర్ణయాల వివరాలు వెంటనే మరో వర్గానికి తెలిసిపోతుండడం, మీడియాకు సైతం లీకవుతుండటం వారిని కలవరానికి గురిచేస్తున్నది. తాజాగా కూల్చివేతలపై ఇద్దరు ఎంపీలు అనుసరిస్తున్న వైఖరి పలు అనుమానాలకు తావిస్తున్నది. మరోవైపు, కర్ణాటకలో వెలుగుచూసిన భారీ కుంభకోణంపై బీజేపీ ఇప్పటి వరకు స్పందించకపోవడంపైనా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.