e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, September 23, 2021
Home Top Slides Telangana Cotton : ఊరంతా ఒకే మాట.. పత్తి బాట

Telangana Cotton : ఊరంతా ఒకే మాట.. పత్తి బాట

  • సికిందర్‌నగర్‌లో మొత్తం 2300 ఎకరాలు
  • 1950 ఎకరాల్లో పత్తి.. 12 ఎకరాల్లోనే వరి
  • 30 ఏండ్లుగా తెల్ల బంగారం వైపే మొగ్గు
  • సమిష్టిగా సాగుతున్న యాదాద్రి జిల్లాలోని
  • సికిందర్‌నగర్‌ రైతుల విజయగాథ ఇదీ!

అయితే వరి.. లేదంటే మిర్చి.. కొంతమేర కొర్రలు, జొన్నలు సాగుచేయడమే అక్కడి రైతులకు తెలుసు. కాలానుగుణంగా నీటికొరత, చీడపీడల బెడద వారిలో మార్పు తెచ్చింది. సాగును నష్టాల నుంచి బంగారుబాట పట్టించేందుకు ఊరంతా ఒక్కతాటిపైకి వచ్చింది.
చిన్న, సన్నకారు తేడా లేకుండా రైతులందరూ పత్తిబాట పట్టారు. ఇరవై, ముప్పై ఏండ్లుగా అదేబాటలో నడుస్తున్నారు. గ్రామంలో 2,300 ఎకరాలు వ్యవసాయ యోగ్యభూమి ఉండగా.. ఈ వానకాలంలో 1,950 ఎకరాల్లో పత్తిని సాగుచేశారు. 12 ఎకరాల్లోనే వరి నాట్లు వేశారు. ఇది యాదాద్రి భువనగిరి జిల్లాలోని సికిందర్‌ నగర్‌ స్ఫూర్తిగాథ.

గంజి ప్రదీప్‌కుమార్‌

- Advertisement -

యాదాద్రి భువనగిరి, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణప్రతినిధి): యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం సికిందర్‌నగర్‌ గ్రామస్తులకు వ్యవసాయమే జీవనాధారం. జిల్లాలోనే అత్యధికంగా వ్యవసాయభూములు మోటకొండూరు మండలంలోనే ఉన్నాయి. ఇందులో ఎక్కువభాగం వర్షాధారంగానే సాగుచేస్తుండగా.. మరికొంత బోర్లు, బావుల కింద సాగవుతున్నది. మండలంలోని సికిందర్‌నగర్‌ గ్రామ పరిస్థితి కూడా ఇంచుమించు ఇదే. గ్రామంలోని రైతులు ఒకవైపు నీటి సమస్య, మరోవైపు చీడపీడల ఇబ్బందిని అధిగమించేందుకు పత్తిని సాగుచేయాలని నిర్ణయించుకొన్నారు. గ్రామంలో 137 దాకా రైతు కుటుంబాలు ఉంటే ఒకట్రెండు మినహా అందరూ పత్తినే సాగుచేస్తున్నారు. ముప్పైఏండ్లుగా మూకుమ్మడిగా పత్తిని సాగుచేస్తూ పదింతల లాభం పొందుతున్నారు. గతేడాది వానకాలంలో 2,100 ఎకరాల్లో దూదిపంట వేయగా.. 10 ఎకరాల్లో మాత్రమే వరిని సాగుచేశారు. ఈ వానకాలంలోనూ 1,950 ఎకరాల్లో పత్తిపంటే సాగువుతున్నది. 12 ఎకరాల్లోనే ఒకరిద్దరు రైతులు వరినాట్లు వేశారు.

ప్రభుత్వం సీసీఐ కేంద్రాల ద్వారా మద్దతు ధరకు పత్తిని కొనుగోలు చేయడంతో మరింత ఉత్సాహంగా ముందుకుసాగుతున్నారు. ఒకప్పుడు అన్ని గ్రామాల్లాంటిదే సికిందర్‌నగర్‌ కూడా. సేద్యపు కష్టాలను భరించింది. కరువులను తట్టుకున్నది. చెంతన ఊర చెరువు, వరద సమయంలో పారే పెద్దవాగు మినహా చెప్పుకోదగిన నీటి వనరులు ఈ ప్రాంతం లో లేవు. వరితోపాటు మిర్చి, కొర్రలు, పచ్చజొన్న పంటలను రైతులు సాగుచేస్తూ వచ్చారు. నీటి కొరత, ఇతర సమస్యల నేపథ్యంలో నష్టాలను చవిచూశారు. ఆంధ్రా ప్రాంతం నుంచి వలసవచ్చి ఇక్కడ స్థిరపడిన రైతు కుటుంబాలు సికిందర్‌నగర్‌లో స్థిరనివాసం ఏర్పాటుచేసుకున్నాయి. వారు వచ్చాక సంప్రదాయ పంటలకు స్వస్తి పలికి ఇరవై, ముప్పై ఏండ్లుగా పత్తినే ప్రధానపంటగా సాగుచేస్తున్నారు.

ఊర చెరువు, పెద్దవాగు వెంట పది, 12 ఎకరాల్లో కొందరు రైతులు వరి వేసుకుంటున్నారు. ఈ ప్రాంతంలోఉన్న నల్లరేగడి భూములు సైతం పత్తి సాగుకు అనుకూలంగా ఉండటంతో రైతులకు పదింతల లాభాన్ని తెచ్చిపెడుతున్నాయి. ఒకప్పుడు వ్యవసాయంలో కష్టనష్టాలను చవిచూశామని, ఇప్పుడు యాభై క్వింటాళ్లకు తక్కువకాకుండా పత్తితీసే రైతు లేడని గ్రామస్తులు ధీమాగా చెప్తున్నారు. రైతుబంధు సాయం అందాక మరింత విస్తీర్ణంలో సాగుచేస్తున్నారు. సికిందర్‌నగర్‌ రైతుల స్ఫూర్తితో మండలంలోని ఇతర గ్రామాల్లోనూ మెట్టపంటగా పత్తికే మొగ్గు చూపుతున్నారు.

ఎకరాకు 50 వేలు మిగుల్తున్నయ్‌

నాకున్న మూడెకరాల్లో పదేండ్లక్రితం వరకు శనగలు వేసిన. పత్తి పంటతో లాభం ఎక్కువగా ఉంటదని తెలుసుకుని ఏటా పత్తినే పండిస్తున్న. దిగుబడులు బాగా రావడంతో పెట్టుబడి, అప్పులు తీరడమే కాదు. మిగులుబాటు కూడా అవుతున్నది. ఎకరాకు 50వేలు మిగులుతున్నయ్‌.
భూమర్ల నర్సయ్య, గ్రామ రైతు

నా కొడుకు ఉద్యోగం మాని సేద్యం చేస్తున్నడు

నాకు నాలుగెకరాల భూమి ఉన్నది. ఇరవై ఏండ్లక్రితం వరకు మొక్కజొన్న, జొన్న, రాగులు వంటి పంటలు పండించిన. వీటితో అంతగా లాభం లేదని పత్తిపంట వేసిన. ఎకరాకు 12 క్వింటాళ్లకుపైనే దిగుబడులు వచ్చినయ్‌. హైదరాబాద్‌లో ప్రైవేటు జాబ్‌చేసుకుంటున్న నా చిన్న కొడుకు ఊర్లనే వ్యవసాయం చేస్తున్నడు. ఈసారి 8 ఎకరాలు కౌలుకు తీసుకుని మరీ పత్తివేసిన. పత్తితో వస్తున్న లాభాలను చూసి ఏటా దానిని సాగుచేయకుండా ఉండలేకపోతున్నా.
పోలిశెట్టి మెలతరాజు, గ్రామ రైతు

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana