BJP | కమలం అధ్యక్షుడి ఇంటి దగ్గర చోటా నేతలు వేచి ఉన్నారు. ఆయనేదో సీరియస్ చర్చల్లో ఉన్నారని అనుకుంటున్నారు. ఇంతలోనే అటెండర్ బయటకొస్తే కొందరు అతన్ని చుట్టు ముట్టి ‘అధ్యక్షుల వారు ఎన్నికలకు అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారా?’ అని అడిగారు. అటెండర్ అలా అడిగిన వారిని ఎగాదిగా చూసి ‘అభ్యర్థులా ఎందుకు?’ అని ఆశ్చర్యంగా పలికాడు.
‘అదేంటోయ్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది.. అభ్యర్థులను ఎంపిక చేయకపోతే ఎలా? మనమే అధికారంలోకి రాబోతున్నాం… అని, రోజుకు డజనుసార్లు చెబుతున్నాం. నువ్వు రహస్యం దాస్తున్నావు? నీ స్ట్రాటజీ మాకు తెలియదు అనుకోకు. అభ్యర్థుల పేర్లు అడుగుతామని, నువ్వు అలా అంటున్నావు… మాకు తెలుసు లే’ అని కోరస్ పలికారు. ‘స్ట్రాటజీ లేదూ… గాడిద గుడ్డూ లేదు… మధ్యాహ్నం పన్నెండు గంటల వరకూ లేవడు .. ఇదేంటి సార్ అంటే ఆలస్యంగా లేవడం వెనుక పెద్ద స్ట్రాటజీ ఉంది అంటాడు’ అని చెప్పి వెళ్లిపోయాడు.
అటెండర్ చెప్పినట్టుగానే కమలాధ్యక్షులవారు పన్నెండు తరువాత వాళ్లని లోపలికి పిలిచారు. చోటా నేతలు అంతా లోనికి వెళ్లేసరికి కమలాధ్యక్షులు కుర్కురే తింటూ ఏదో ఆలోచిస్తున్నారు. ‘అభ్యర్థుల గురించే ఈ ఆలోచన’ అని అంతా మనసులోనే అనుకున్నారు. ‘ఏంటీ ఇలా వచ్చారు’ అని ప్రశ్నించారు అధ్యక్షులు.
‘ఎన్నికలకు రోజులు దగ్గర పడ్డాయి. అభ్యర్థులను ప్రకటిస్తే ప్రచారం చేసుకుంటాం’ అని పలికారు వెళ్లిన వాళ్లంతా. ‘మీ ముగ్గురూ గత ఎన్నికల్లో పోటీ చేశారు కదా! మీకెన్ని ఓట్లు వచ్చాయి?’ అని అధ్యక్షుడు ప్రశ్నించారు.
‘సార్… ఆడవాళ్ల వయసు, మగవారి జీతం, కమలం అభ్యర్థులకు వచ్చిన ఓట్లు… అడగొద్దు’ అని ఒక నేత చెప్పగానే, అంతా ఘొల్లున నవ్వారు. మాకే కాదు మన పార్టీ తరఫున పోటీ చేసిన 105 మందికీ డిపాజిట్ రాలేదు’ అని చెప్పుకొచ్చారు.
‘ఎలాగూ డిపాజిట్లు పోగొట్టుకోవడానికి ఇంత హైరానా ఎందుకు…’ అని అధ్యక్షుడు విసుగ్గా అడిగాడు. వెనుక నుంచి ఎవరో ‘వసూళ్లకు..’ అని గట్టిగా అరిచారు.
‘అదేంటో మనకు ఓట్లు తక్కువ .. వసూళ్లు ఎక్కువ’ అని మరొకరు జోక్ చేశారు.
‘అన్ని పార్టీలూ తమ అభ్యర్థులను ప్రకటించిన తరువాత మనం మన జాబితా విడుదల చేస్తాం. దీని వెనుక పెద్ద స్ట్రాటజీ ఉంది’అని అధ్యక్షుడు సెలవిచ్చారు.
‘పోటీ చేయడానికి ఎవరూ దిక్కు లేరు. కాబట్టి, ఇతర పార్టీల్లో టికెట్ ఆశించి భంగపడ్డ అభ్యర్థులు వస్తే టికెట్ ఇస్తామని సార్ ఎంత బాగా చెబుతున్నారో…’అని ఓ చోటా నేత మురిసిపోయాడు.
***
‘సార్ గత వారం వస్తే పెద్ద స్ట్రాటజీ ఉంది. అందుకే ఆలస్యంగా అభ్యర్థులను ప్రకటిస్తాం అన్నారు. ఇప్పుడేమో ఇంకా ఆలోచనలోనే ఉన్నారు. కానీ, జాబితా బయటకు రాలేదు. నామినేషన్లు దాఖలు చేయడానికి చివరి రోజు కూడా వచ్చేస్తున్నది. అభ్యర్థులను ఇంకెప్పుడు ప్రకటిస్తారు సార్…’ అని చోటా నేతలు దిగులుగా అడిగారు.
‘ప్రతి ఆలస్యం వెనుకా ఒక స్ట్రాటజీ ఉంటుంది. అది మీకు తెలియదు. అర్థం కాదు, వెళ్లండి…’ అని అధ్యక్షుడు గట్టిగా చెప్పారు.
‘మన అధ్యక్షుడి స్ట్రాటజీ అర్థం అయింది. ఎన్నికల్లో పోటీ చేస్తేనే కదా డిపాజిట్ పోయేది. అసలు పోటీనే చేయకపోతే డిపాజిట్ గల్లంతయ్యే అవకాశమే లేదు. గత ఎన్నికల్లో 102 స్థానాల్లో డిపాజిట్ పోగొట్టుకున్నాం అని, అంతా ఎగతాళి చేస్తున్నారు. కానీ ఈసారి, అన్ని స్థానాల నుంచీ పోటీ చేయకుండా ఉంటే , డిపాజిట్ డబ్బులు మిగులుతాయి. డిపాజిట్లు దక్కని పార్టీ అంటూ మాటలు పడాల్సిన అవసరమూ ఉండదు. సార్ స్ట్రాటజీ సూపరో సూపరు. అసలిది పేలి పోయే స్ట్రాటజీ అంతే…’ అని ఓ నేత మురిసి పోతే … ‘పేలి పోయే స్ట్రాటజీ కాదు… పువ్వు వాలిపోయే స్ట్రాటజీ…’ అని మరో నేత అందరికీ వినిపించేలా అనేశాడు.
– మురళి