హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ): ఎస్సీ గురుకుల సొసైటీ చరిత్రలోనే మొదటిసారిగా నాన్ ఐఏఎస్, నాన్ గ్రూప్-1 ఆఫీసర్‌ను సెక్రటరీగా కాంగ్రెస్ ప్రభుత్వం నియమించింది. అకడమిక్స్ నుంచి వచ్చిన అధికారికే సెక్రటరీగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలను అప్పగించింది. సొసైటీ జాయింట్ సెక్రటరీ శారదను ప్రభుత్వం సెక్రటరీగా నియమించింది. ఈ మేరకు సంక్షేమశాఖల ప్రత్యేక ప్రధానకార్యదర్శి సవ్యసాచి ఘోష్ సోమవారం సాయంత్రం ఉత్తర్వులు జారీచేశారు. కేవలం తమ అనుకూల వర్గానికి టెండర్లను అప్పగించడం కోసమే ప్రభుత్వం ఆగమేఘాల మీద నాన్ ఐఏఎస్, నాన్ గ్రూప్-1 ఆఫీసర్‌ను సెక్రటరీగా నియమించిందని సొసైటీలో చర్చ కొనసాగుతున్నది.
ఎస్సీ గురుకుల సొసైటీ నిబంధనల ప్రకా రం సెక్రటరీని ప్రభుత్వమే నియమించాలి. ఇప్పటివరకు గురుకుల సొసైటీల సెక్రటరీగా ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్లను లేదంటే స మాన హోదా ఉన్న అధికారులనే ప్రభుత్వాలు నియమిస్తూ వచ్చాయి. తెలంగాణ ఏర్పాటు తరువాత కూడా అదే సంప్రదాయం కొనసాగింది. ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, రొనాల్డ్ రాస్, నవీన్ నికోలస్ వంటి సమర్థులైన అధికారులు ఎస్సీ గురుకుల సొసైటీ సెక్రటరీగా సేవలు అందించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం సొసైటీ చరిత్రలోనే ఎన్నడూ లేనివిధంగా నాన్ ఐఎస్ఎస్, కనీసం గ్రూప్-1 ఆఫీసర్ కూడా కాని, అకడమిక్స్ నుంచి వచ్చిన టీచర్ శారదను అధికారిగా నియమించింది.
శారద గురుకుల సొసైటీలో 1995 సంవత్సరంలో తెలుగు టీజీటీ (ట్రైన్డ్ గ్య్రాడుయేట్ టీచర్)గా చేరి, ఆ తరువాత జేఎల్ (జూనియర్ లెక్చరర్)గా, ప్రిన్సిపల్‌గా, ఆర్సీగా (రీజినల్ కో ఆర్డినేటర్)గా సేవలందించారు. ఆ తరువాత నేరుగా సొసైటీ జాయింట్ సెక్రటరీగా నియమితులయ్యారు. సొసైటీ బైలా ప్రకారం డిప్యూటీ సెక్రటరీగా పనిచేసిన అనుభవజ్ఞులైన వారికి ప్రమోషన్ కల్పించడం ద్వారా జాయింట్ సెక్రటరీ పోస్టును భర్తీ చేయాలి. కానీ అవేవీ లేకుండా ఆర్సీ నుంచి నేరుగా జేఎస్గా శారదను నియమించారు. ప్రభుత్వ నిర్ణయంపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా, కాంగ్రెస్ వచ్చిన రెండున్నరేండ్లలో గురుకుల సొసైటీకి ముగ్గురు సెక్రటరీలు మారారు. అలుగు వర్షిణి, కృష్ణా ఆదిత్య, ఇటీవల విజయేంద్రబోయిని ప్రభుత్వం నియమించింది. రెండు నెలలు తిరగకుండానే ప్రస్తుతం శారదను నియమించారు.
రాష్టంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, జనరల్ గురుకులాలతోపాటు, సంక్షేమ హాస్టళ్లు, కస్తూర్బా విద్యాలయాలు, గిరిజన ఆశ్రమ పాఠశాలలు, మోడల్ స్కూల్స్, ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఆయా విద్యాసంస్థల్లోని విద్యార్థులకు ప్రతి సంవత్సరం పుస్తకాలు, యూనిఫామ్స్, స్టేషనరీ, దుప్పట్లు, బూట్లు, సాక్సులు మొత్తంగా 24రకాల వస్తువులను ప్రభుత్వమే అందిస్తుంది. అయితే గతంలో ఏ విద్యాసంస్థకు సంబంధించి అవే సొంతంగా జిల్లా స్థాయిలో కలెక్టర్ల ద్వారా టెండర్లు నిర్వహించి కొనుగోలు చేసేవి. ఇప్పటివరకు అదే పద్ధతిని పాటించారు. కానీ కాంగ్రెస్ వచ్చాక ఈ ప్రక్రియకు స్వస్తి పలకాలని నిర్ణయించింది. నిరుడు సోషల్వెల్ఫేర్ సెక్రటరీ నేతృత్వంలో అన్ని గరుకుల సొసైటీల కార్యదర్శులతో ప్రత్యేకంగా ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్ (పీఎంయూ)ను ఏర్పాటుచేసింది.
సంక్షేమ గురుకులాలు, వసతిగృహాల్లో నిత్యావసర సరుకుల ప్రొక్యూర్మెంట్, ఇతర సరుకుల సేకరణపై మార్గదర్శకాలను ఈ పీఎంయూనే నిర్ణయించింది. నిత్యావసర వస్తువులు సరఫరా, సేకరణ , ధరల ఖరారు, టెండర్ ప్రక్రియను ఏకమొత్తంగా నిర్వహిస్తున్నది. 2026-27 సంవత్సరానికి సంబంధించి టెండర్ ప్రక్రియను ప్రభుత్వం చేపట్టింది. అందుకు సంబంధించి నోటిఫికేషన్ జారీచేసింది. మొత్తంగా 24రకాల వస్తువులకు సంబంధించి జారీచేసిన టెండర్ విలువ రూ.880 కోట్లు కావడం గమనార్హం. బిడ్లను కూడా తెరిచింది. దాదాపు 9 రకాల వస్తువులకు సంబంధించి మొత్తంగా 30 ఏజెన్సీలు బిడ్లను దాఖలు చేయగా, అందులో కేవలం 12 మాత్రమే అర్హత సాధించినట్టు సమాచారం. మరో రెండు రకాల వస్తువులకు ఏ ఒక్క ఏజెన్సీ అర్హత సాధించలేదని తెలుస్తున్నది. అయితే ప్రస్తుతం 7రకాల వస్తువులకు ఏజెన్సీల ఎంపిక కూడా పూర్తయిందని తెలిసింది.
అందులో ఒకే కంపెనీకి దాదాపు రూ.600 కోట్లకు పైగా విలువైన టెండర్లను అప్పగించేందుకు ప్రభుత్వం సిద్ధమైందని విశ్వసనీయ సమాచారం. ఇందులో పొరుగున ఏపీకి చెందిన బినామీల హస్తముందని తెలుస్తున్నది. అనుయాయులకు టెండర్లను కట్టబెట్టేందుకు, వర్క్ ఆర్డర్లను ఇచ్చేందుకే హడావుడిగా ప్రస్తుతం సొసైటీ సెక్రటరీని నియమించినట్టు తెలుస్తున్నది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇటీవల సంక్షేమశాఖ మంత్రి ప్రమేయం లేకుండానే సొసైటీల టెండర్లపై సమీక్షించారు. ఆ సందర్భంగానే వర్క్ ఆర్డర్లను పూర్తిచేయాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో తాజాగా శారద నియామకం చర్చనీయాంశంగా మారింది. కేవలం అనుయాయులకు టెండర్లను కట్టబెట్టడం కోసమే ఈ నియామకం జరిగిందని తెలుస్తున్నది.