హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ): దేశంలో ఎన్నడూ లేని రీతిలో కేంద్రంలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ.. రాష్ర్టాల్లో అధికారంలో ఉన్న పార్టీలను బెదిరిస్తున్నది. రాష్ర్టాలను పరిపాలిస్తున్న నేతల మీద దర్యాప్తు చేయడం మొదలుకొని.. ప్రభుత్వాలను కూలగొట్టడం.. రాష్ర్టాలను విడగొట్టడం దాకా కేంద్రంలో ఉన్న పార్టీ తెంపరితనంతో వ్యవహరిస్తున్నది. భారతీయ జనతాపార్టీలో కేంద్ర మంత్రులుగా, జాతీయ, రాష్ట్ర స్థాయి నాయకులుగా చెలామణి అవుతున్న నాయకులే అన్ని విచ్ఛినకరమైన మాటలు మాట్లాడుతున్నారు. ఒకరకంగా చెప్పాలంటే దేశంలో ప్రస్తుతం రాజకీయ ఉగ్రవాదం కొనసాగుతున్నదని ప్రముఖ రాజకీయ విశ్లేషకులే అభిప్రాయపడుతున్నారు. మామూలుగా రాజకీయ పార్టీల మధ్యన విమర్శలు.. ప్రతి విమర్శలు.. సవాళ్లు.. సంజాయిషీల వంటివి ప్రజాస్వామ్య ప్రక్రియలో జరుగుతుంటాయి. కానీ విలువలకు మారుపేరు అంటూ ప్రచారం చేసుకొనే భారతీయ జనతాపార్టీ నుంచి వీటన్నింటికీ భిన్నంగా విచ్ఛిన్నకర అరాజకీయాన్ని ఇప్పుడే చూస్తున్నామని వారు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు.
పక్కా ప్రణాళికతో ముందుకు..
ఇప్పుడు మోదీ, షా నేతృత్వంలో కొనసాగుతున్న బీజేపీ తాననుకొన్న ఎజెండాను పక్కా ప్రణాళికతో అమలుచేస్తున్నది. గత ఎనిమిదేండ్లలో జరిగిన పరిణామాలను పరిశీలిస్తే.. మొత్తంగా నాలుగు దశల్లో ప్రత్యర్థులను నిర్వీర్యం చేసే ఎత్తుగడ వేస్తున్నది. ముందుగా స్థానిక నాయకులతో రెచ్చగొట్టే ప్రకటనలు.. నైతికతతో సంబంధం లేకుండా అదేపనిగా.. పదేపదే చేయించడం.. ముఖ్యంగా మతపరమైన తీవ్రస్థాయి వ్యాఖ్యలు చేయించడం.. ఆ తరువాత యావత్ పార్టీ యంత్రాంగం బల ప్రదర్శన చేయడం.. (బెంగాల్, బీహార్, యూపీ సహా.. ఇటీవల తెలంగాణలో జరిగిన ఎన్ఈసీ సమావేశాలు) అనంతరం ఈడీ, సీబీఐ వంటి సంస్థలను ఆయా పార్టీల నాయకులపైకి ఉసిగొల్పడం.. ఆధారాలున్నా.. లేకపోయినా.. పీఎంఎల్ఎ వంటి చట్టాలను ప్రయోగించి ఉక్కిరిబిక్కిరి చేయడం.. తదనంతరం ఆయా రాజకీయ పార్టీల్లో చీలికలు కల్పించి.. వాటిలోని నాయకులను తమ పార్టీలో చేర్పించడం.. తద్వారా సదరు రాజకీయ పార్టీని బలహీనపరిచేందుకు యత్నించడం(మహారాష్ట్రలో శివసేన విషయంలో జరిగినదే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ) చేస్తున్నది.
రాష్ర్టాల్లో పార్టీలను బెదిరించి, బలహీనపరచి, పడగొట్టి.. పాదాక్రాంతం చేసుకొనే క్రమంలో బీజేపీ అన్ని ప్రజాస్వామిక విలువలకు తిలోదకాలు ఇస్తున్నది. అన్ని రకాల రాజ్యాంగ నియమాలను తుంగలో తొక్కుతున్నది. పరిపాలన సంప్రదాయాలను ధ్వంసం చేస్తున్నది. ‘ఐతే నాకు లొంగిపోయి ఉండు.. ‘లేకుంటే నువ్వు నాకు శత్రువువే (either your with me or my enemy)’ అన్న ఇంగ్లిష్ జాతీయాన్ని బీజేపీ నిజం చేస్తున్నది. ప్రజాస్వామ్యంలో రాజకీయ ప్రత్యర్థులు ఉంటారు. విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగుతుంటాయి. మొత్తం మీద ప్రజలను ఒప్పించి, మెప్పించి ఆమోదం పొందే వ్యూహమే రాజకీయం. అంతే తప్ప మేం చెప్తాం. మేం చెప్పిన దాన్ని పాటించి తీరాలి. లేకపోతే మీరు రాజద్రోహం చేసినట్టే. మిమ్మల్ని ఏదైనా చేసేస్తామన్నట్టుగా బీజేపీ రాజకీయం కొనసాగుతున్నది. గత కొంతకాలంగా ఆ పార్టీ జాతీయ నాయకులు, సీఎంలు, కేంద్ర మంత్రులు ఇలాంటి వ్యాఖ్యానాలే చేస్తున్నారు. మహారాష్ట్ర మాదిరిగా ఇతర రాష్ర్టాల ప్రభుత్వాలను కూడా కూలుస్తామని ప్రేలాపనలు చేస్తున్నారు.
మహారాష్ట్ర తాజా ఉదాహరణ
ఒక రాష్ట్రంలో ప్రజలెన్నుకున్న సర్కారును తన ఇష్టానుసారం అడ్డగోలుగా కూల్చివేయడం బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య. 2014 నుంచి నిన్నటి మహారాష్ట్ర దాకా ఎనిమిది ప్రభుత్వాలను పడగొట్టిన ఘనత బీజేపీది. మహారాష్ట్రంలో శివసేన సర్కారును కూల్చడానికి కేంద్రంలోని బీజేపీ సర్కారు ఎంచుకున్న అస్త్రం ఈడీ, ఐటీ, సీబీఐ దాడులేనన్నది బహిరంగ రహస్యం. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేనకు చెందిన 18-20 మంది ఎమ్మెల్యేలను ఈ అస్త్రం వాడే బీజేపీ లొంగదీసింది. మరో ప్రత్యామ్నాయం లేక బీజేపీకి లొంగిపోయిన సదరు ఎమ్మెల్యేలు.. ఈడీ సంగతిని చెప్పుకోలేక బాల్‌ఠాక్రే ఆశయాలకు ఏదో ముప్పు వాటిల్లిపోయిందంటూ బిల్డప్ ఇచ్చి కొత్త కుంపటి పెట్టుకొని.. ప్రభుత్వ పతనానికి కారణమయ్యారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఇస్లామిక్ తీవ్రవాదుల చేతిలో ఒక టైలర్ హత్యకు గురైతే, వారికి హైదరాబాద్‌తో లింక్‌లు ఉన్నాయని కేంద్ర ఆధీనంలోని దర్యాప్తు సంస్థలతో ప్రకటనలు చేయిస్తూ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. మహారాష్ట్రలోని అమరావతి ఎంపీ, ఎమ్మెల్యేల దంపతులకు కశ్మీర్ తీవ్రవాదులతో సంబంధాలు అంటగట్టడం కూడా బెదిరింపుల్లో భాగమేనన్న విమర్శలున్నాయి.
విభజిస్తాం.. యూటీ చేస్తాం
ముంబైని కేంద్ర పాలిత ప్రాంతం చేస్తామని, తమిళనాడు, పశ్చిమబెంగాల్, కర్ణాటక రాష్ర్టాలను విభజిస్తామంటూ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు బరితెగించి చేస్తున్న ప్రకటనల వెనుక కూడా పరోక్షంగా విపక్ష పార్టీలను, ప్రభుత్వాలను బెదిరించే వ్యూహం ఉన్నదన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. తమిళనాడును విభజించాలని ప్రధాని మోదీని కోరుతామంటూ మూడు రోజుల కిందట తమిళనాడు బీజేపీ ఎమ్మెల్యే నాయనార్ నాగేంద్రన్ చేసిన ప్రకటనను గుర్తు చేస్తున్నారు. విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ర్టాలను ఏ విధంగా కూల్చడానికి కేంద్రం కాచుకు కూర్చున్నదో అర్థం చేసుకోవడానికి రాజ్యసభ సభ్యుడిగా శుక్రవారం ప్రమాణం చేసిన బీజేపీ తెలంగాణ నేత లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలే అద్దం పడుతున్నాయి. టీఆర్ఎస్లో కట్టప్పలు ఉన్నారంటూ లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలు బీజేపీ కుట్రలకు అద్దం పడుతున్నాయి. విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ఫిరాయింపులను ప్రోత్సహించడం, కేంద్ర దర్యాప్తు సంస్థలతో నోటీసులు ఇప్పించడం వంటి టక్కుటమార విద్యలను ప్రయోగించడానికి బీజేపీ సర్కార్ గోతికాడి నక్కలా కాచుకు కూర్చుంటున్నదన్న విషయాన్ని ఇటీవలి పరిణామాలే తేటతెల్లం చేస్తున్నాయి.
పెరటి విచారణ సంస్థలతో హల్చల్
బీజేపీ సమావేశాల్లో ఆ పార్టీ నేతలు చేసిన హెచ్చరికలను అంత తేలిగ్గా తీసుకోవద్దని నాలుగు రోజుల పరిణామాలు సూచిస్తున్నాయి. బీజేపీ కార్యవర్గ సమావేశాలు ముగిసిన తర్వాత పలువురు విపక్ష నేతలు ఈడీ రాడార్లోకి వచ్చారు. కాంగ్రెస్ మిత్రపక్షమైన జార్ఖండ్ ముక్తి మోర్చా నేత, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అనుచరుడి నివాసంపై ఈడీ శుక్రవారం సోదాలు నిర్వహించింది. మహారాష్ట్రలో శివసేన సర్కార్‌కు చివరి దాకా అండగా నిలిచిన ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌కు ఎప్పుడో ఎన్నికల అఫిడవిట్లో దాఖలు చేసిన ఆస్తుల వివరాలపై ఐటీ శాఖ ఇప్పుడు నిద్రలేచి నోటీసులు ఇచ్చింది. శివసేన ఎంపీ సంజయ్‌రౌత్‌కు సరిగ్గా మహారాష్ట్ర సర్కార్‌ను కూల్చే క్రమంలోనే ఈడీ ఆవులించి.. నోటీసులివ్వడం వెనుక బెదిరింపు ధోరణి తప్ప ఇంకేమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతున్నది. మహారాష్ట్రకు చెందిన మాజీ మంత్రి, ఎన్సీపీ నేత అనిల్ప్రణబ్.. మనీ ల్యాండరింగ్ కేసులో విచారణను ఎదుర్కొంటున్నారు.