కొల్లాపూర్ : ధాన్యం కొనుగోళ్లు రాష్ట్రంలో వేగంగా, సజావుగా కొనసాగుతున్నాయని పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ( Minister Jupally Krishna Rao ) అన్నారు. కొల్లాపూర్ మండలం ఎన్మనబెట్ల గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ( Grain procurement ) బుధవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. రైతులకు న్యాయమైన మద్దతు ధర, సమయానికి కొనుగోలు, పారదర్శక వ్యవస్థ అందించేందుకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని పేర్కొన్నారు. ప్రభుత్వం ఏ గ్రేడ్ రకానికి క్వింటాలుకు రూ.2,389, సాధారణ రకానికి రూ. 2, 369 మద్దతు ధర కల్పిస్తుందని, సన్నాలకు రూ. 500 బోనస్ ఇస్తుందని చెప్పారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని, మధ్య దళారులను నమ్మి మోసపోవద్దని కోరారు. కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని, ప్రణాళికా బద్ధంగా ధాన్యం కొనుగోలు జరగాలని అధికారులను మంత్రి ఆదేశించారు.కొల్లాపూర్ నియోజకవర్గంలో మహిళ సమాఖ్య సంఘాల ఆధ్వర్యంలోనే వరి ధాన్యం కొనుగోలు చేసేలా ఏర్పాట్లు చేశామని చెప్పారు.
కొనుగోలు కేంద్రాల్లో సన్న, దొడ్డు రకం ధాన్యం 17శాతం తేమ ఉన్నా కొనాల్సిందేనని స్పష్టం చేశారు. ధాన్యం తూకమైన వెంటనే రైతుకు రసీదు ఇవ్వాలని, ఆ తర్వాత ధాన్యం తరలింపు విషయంలో రైతుకు ఎలాంటి సంబంధం ఉండదని, మిల్లుకు తరలించే బాధ్యత పౌర సరఫరాల, వ్యవసాయ శాఖ అధికారులదేనని స్పష్టం చేశారు.