Karnataka | కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ బుధవారం సంచనల వ్యాఖ్యలు చేశారు. కర్నాటక కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి తాను వైదొలగాల్సిన రావొచ్చునన్నారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శివకుమార్ మాట్లాడుతూ.. నేను కొనసాగాలా వద్దా? అనేది ముఖ్యం కాదని.. తన పదవీకాలంలో వంద పార్టీ కార్యాలయాలను ఏర్పాటు చేయాలనుకుంటున్నానన్నారు. పదవిలో శాశ్వతంగా తాను ఉండలేనని.. ఐదున్నర సంవత్సరాలు అయ్యిందని.. మార్చినాటికి ఆరు సంవత్సరాలు అవుతుందన్నారు. ఇతరులకు అవకాశం ఇవ్వాలన్నారు. తాను ఆయన నాయకత్వంలోనే ముందు వరుసలో ఉంటానని.. ఎవరూ చింతించొద్దన్నారు. డీకే శివకుమార్ 2020 మే నెలలో కర్నాటక కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియామకమయ్యారు.
2023 మే నెలలో ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక రాజీనామాకు సిద్ధపడగా.. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సీనియర్ నేత రాహుల్ గాంధీ డీకేనే కొనసాగించాలన్నారు. అంతకు ముందు ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ కార్యకర్తలు ఆశతో పార్టీ కోసం పని చేయాలని కోరారు. తాను ఎక్కడ ఉన్నా పర్వాలేదని.. కర్నాటకలో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తుందనే నమ్మకం ఉందని.. ఆశను కోల్పోవద్దన్నారు. అందరం ఆశతోనే జీవిస్తూ పని చేయాలని కోరారు. అధికారం లభిస్తుందని చింతించాల్సిన అవసరం లేదన్నారు. కానీ, దాన్ని సాధించేందుకు కష్టపడి పని చేయాలన్నారు. కర్నాటకలో సీఎం మార్పుపై మరోసారి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో డీకే శివకుమార్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నెలలో పదవీకాలం రెండున్నర సంవత్సరాలకు చేరుతుంది. ఈ క్రమంలో డీకే శివకుమార్ సీఎం బాధ్యతలు తీసుకుంటారని భావిస్తున్నారు. గతంలో ఇదే తరహాలో ప్రచారం జరగ్గా.. డీకే వాటిని ఖండించారు.