యాదాద్రి భువనగిరి, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ) : ట్రిపుల్ ఆర్ పై కాంగ్రెస్ సరార్ ముందుకే వెళ్తున్నది. అలైన్ మెంట్ మార్పు డిమాండ్లను లెకచేయకుండా మొండిగా వ్యవహారిస్తున్నది. ఎలాంటి మార్పులు చేపట్టకుండానే పలు మండలాల్లో రైతులకు పరిహారం పంపిణీ చేస్తున్నది. దీంతో నాడు ఎన్నికల సమయంలో కుంభం అనిల్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చి.. నేడు మోసం చేస్తున్నారని బాధితులు నిప్పులు చెరుగుతున్నారు. మరో దఫా ఉద్యమానికి సిద్ధం అవుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా భారత్ మాల పరియోజన కింద రీజనల్ రింగ్ రోడ్డు (ఆర్ ఆర్ ఆర్ ) నిర్మించనున్నాయి. ప్రస్తుతం ఉన్న అలైన్ మెంట్ ప్రకారం ఆర్ ఆర్ ఆర్ ఉత్తరభాగం మొత్తం సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లోని 19 మండలాలకు చెందిన 113 గ్రామాల మీదుగా వెళ్తున్నది. ప్రాజెక్టును ఉత్తర, దక్షిణ భాగాలుగా విభజించారు. ఉత్తర భాగంలో జిల్లా మీదుగా 59.33 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మించనున్నారు. దీని పరిధిలోకి తురపల్లి, యాదగిరిగుట్ట, భువనగిరి, వలిగొండ, చౌటుప్పల్ మండలాలు ఉన్నాయి. ఈ సందర్భంగా సుమారు 2వేల ఎకరాలను సేకరించనున్నారు. అయితే భువనగిరి పరిధిలో కొంతకాలం హైకోర్టు స్టే ఉండటంతో భూ సేకరణ ప్రక్రియకు బ్రేక్ పడింది. ఆ తర్వాత హైకోర్టు స్టేను ఎత్తేసినా రైతులు తీవ్రంగా వ్యతిరేకంచడంతో పెండింగ్‌లో పడింది. అధికారులు నోటీసులు పంపించి.. ఆయా గ్రామాల వారీగా ఆర్డీవో కార్యాలయంలో సమావేశాలు ఏర్పాటు చేశారు. కానీ అధిక శాతం రైతులు బహిషరించిన విషయం తెలిసిందే.
రీజినల్ రింగ్ రోడ్డులో భాగంగా నిర్వాసితులకు పరిహారం పంపిణీ అవుతున్నది. ఈ నెల 14వ తేదీ నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమైంది. మొదటగా భూముల్లో ఎలాంటి స్ట్రక్చర్స్ లేని బాధితుల ఖాతాల్లో పరిహారం పడుతున్నది. ఇటీవల జిల్లాలో మొత్తం 49 మందికి రూ.2,03,97,756 నష్టపోయిన వారికి ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. యాదగిరిగుట్ట మండలం దాతార్పల్లికి చెందిన 12 మందికి రూ.69.55 లక్షలు, తురపల్లి మండలం దత్తయ్యపల్లి గ్రామంలో 15 మందికి రూ.30,.86, ఇబ్రహీంపూర్ లో ఐదుగురికి రూ 13.66, కోనాపూర్‌లో అరుగురికి రూ.32.20, వేల్పుపల్లి లో 11 మందికి రూ.57.69 ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో రైతుల్లో ఆందోళన నెలకొంది.
రాయగిరి ప్రాంత రైతులు పలు సందర్భాల్లో తమ భూములు కోల్పోవాల్సి వచ్చింది. వైటీడీఏ విస్తరణ, హైటెన్షన్ వైర్లు, జాతీయ రహదారి నిర్మాణం తదితర సమయాల్లో భూములు కోల్పోయారు. ఇప్పుడు మళ్లీ ట్రిపుల్ ఆర్ కింద పోతుండటంతో ఇకడి రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. కొన్ని రోజులుగా ఈ అంశం స్తబ్దుగా ఉండటం, దక్షిణ భాగంలో మార్పులు చేయడంతో ఇకడ కూడా మారుస్తారనే ఆశతో ఉన్నారు. తాజాగా పరిహారం అంశం తెర పైకి రావడంతో బాధితులు మరోసారి ఉద్యమ బాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు. మున్ముందు ఆందోళనలు మరింత ఉగ్రరూపం దాల్చేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమించేందుకు సంసిద్ధులు అవుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో భూములు ఇచ్చేది లేదని కుండబద్దలు కొడుతున్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మారుస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఆ పార్టీ అగ్రనేత ప్రియాంక గాంధీ భువనగిరి పర్యటనకు వచ్చినప్పుడు స్వయంగా ప్రకటన కూడా చేశారు. అంతే కాకుండా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి తదితరులు హామీలు ఇచ్చారు. కుంభం అనిల్ కుమార్ రెడ్డి నాడు ఓట్ల కోసం తమను నమ్మించి మోసం చేశాడని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు కనీసం పట్టించుకోవడం లేదని, ట్రిపుల్ ఆర్ ముచ్చటే తీయడం లేదని భగ్గుమంటున్నారు.