హైదరాబాద్, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ): ‘మనదే ఇదంతా! నేనెంత చెప్తే అంత! బదిలీ కావాల్నా, పోస్టింగా? ఏం కావాలన్నా మై హూనా! అన్నీ నేను చూసుకుంటా.. దగ్గరుండి పని పూర్తి చేయిస్తా..’ ముఖ్యమంత్రి కార్యాలయం కేంద్రంగా ఓ కిలాడీ లేడీ సాగిస్తున్న వ్యవహారమిది. ఆఫీసులో ఆమె ఎంత చెప్తే అంతేనట! ఏం చేస్తే అదేనట!! సోషల్‌మీడియాలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. ప్రభుత్వ పెద్దలతో తనకున్న పరిచయాలను, సీఎంవో సంబంధాలను పబ్లిసిటీ చేసుకుంటూ సదరు మహిళ చేస్తున్న హంగామా రాజకీయ వర్గాల్లో అసక్తికరచర్చకు దారితీసింది.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఎందరో షాడో ముఖ్యమంత్రులు తయారయ్యారనే ఆరోపణలున్న విషయం తెలిసిందే. ఇప్పుడు అదే కోవలో ఓ కిలేడీ కూడా షాడో సీఎంగా వ్యవహరిస్తున్నారన్న గుసగుసలు గుప్పుమంటున్నాయి. ఇటీవలే ఆమె ఎక్కడికెళ్లినా ప్రొటోకాల్ ఏర్పాట్లు సైతం చేసినట్టు అధికారవర్గాలే చెవులు కొరుక్కోవడం, ఒక సాధారణ లేడీకి అంతటి ప్రాధాన్యం ఏంటని వారిలో వారే గొణుక్కోవడం గమనార్హం.
ఇంతకు ఎవరా లేడీ..
కిలాడీ లేడీ వ్యవహారానికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. రాష్ట్రంలోని ఓ అత్యంత కీలకమైన ముఖ్యనేతకు కరీంనగర్‌కు చెందిన ఓ వ్యక్తితో మంచి స్నేహం ఉన్నది. వారిద్దరి మధ్య చదువుకుంటున్న రోజుల నుంచి ఫ్రెండ్షిప్ కొనసాగుతున్నది. ఇటీవల ఆ ముఖ్యనేత కుటుంబసమేతంగా తిరుపతికి వెళ్తే వెంట ఆ స్నేహితుడు కూడా వెళ్లాడంటే వారి స్నేహబంధం అర్థం చేసుకోవాలి. కాగా, ఆ మిత్రుడి తండ్రి కరీంనగర్లో ప్రముఖ వైద్యుడు కూడా.
ఎక్కడికెళ్లినా రాచమర్యాదలు
ఆరు నెలలుగా ఆ మహిళ ఎక్కడకు వెళ్లినా రాచమర్యాదలే. తనకున్న పలుకుబడిని ఉపయోగించి దేవాలయాల్లో కూడా ప్రొటోకాల్ దర్శనాలు, ప్రభుత్వ కార్యాలయాల్లోకి నేరుగా వెళ్లడం, కలెక్టర్లు, ఎస్పీలు వంటి ఉన్నతాధికారులకు పనులు పురమాయింపు చేస్తున్నట్టు సెక్రటేరియట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆ మాటకొస్తే ప్రభుత్వంలోని ఏ శాఖలోనైనా పని కావాలంటే ఆమె ‘లత’లా అల్లుకుపోతున్నదని, ఆమె చెప్తే ఆర్థికశాఖలో బిల్లులు మంజూరవుతాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మెస్సీ వచ్చినప్పుడు కూడా షాడో సీఎంలతో ఫుట్‌బాల్ మ్యాచ్‌కు, ప్రముఖుల పుట్టినరోజు వేడుకలకు కూడా ఆమె హాజరైనట్టు తెలుస్తున్నది.
బిజినెస్ పార్ట్‌నర్స్‌గా
ఇక కరీంనగర్‌కు చెందిన ముఖ్యనేత స్నేహితుడు, కిలాడీ లేడీ కలిసి వ్యాపారాలు కూడా చేస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. వారి వ్యాపారానికి టీజీఐఐసీలోని ఓ కీలక అధికారి కూడా సహకరిస్తున్నట్టు సమాచారం. ఫ్యూచర్ సిటీలో ఇటీవల ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైజింగ్ కార్యక్రమంలో కూడా ఆమె పాల్గొన్నారని తెలుస్తున్నది. ముఖ్యనేత స్నేహితుడితో సన్నిహితంగా ఉండటంతో సెక్యూరిటీ అధికారులు కూడా ఆమెను ఎక్కడా ఆపడం లేదని ఆఫీసర్లే పేర్కొంటుండగా, ఇటీవల జీహెచ్ఎంసీలో జరిగిన బదిలీల్లో తను అత్యంత కీలకమైన పాత్ర పోషించినట్టు మరో విస్తృత ప్రచారం కూడా జరగడం కొసమెరుపు.