హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ): ‘ఈ పార్లమెంట్ ఎన్నికలను కచ్చితంగా తమ పాలనకు రెఫరెండంగా భావిస్తాం’ అంటూ సీఎం రేవంత్‌రెడ్డి గతంలో ప్రకటించారు. కాంగ్రెస్ ఆశించిన విధంగా విజయం సాధించలేకపోవడంతో రేవంత్‌రెడ్డి మాటపై నిలబడతారా? లేదా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ కచ్చితంగా 13 సీట్లు గెలుస్తుందని, కనీసం 10 స్థానాలైనా గెలుచుకుంటామని ఆయన పలు సందర్భాల్లో ప్రకటించారు.
కానీ, ఆ పార్టీ సింగిల్ డిజిట్‌కే పరిమితమైంది. 8 సీట్లు గెలుచుకున్నది. సీఎం సొంత జిల్లా మహబూబ్‌నగర్‌తోపాటు ఎంపీగా తన సిట్టింగ్ స్థానం మల్కాజిగిరిలో కూడా కాంగ్రెస్ ఓడిపోయింది. అధికారంలో ఉండి కూడా ఎంపీ ఎన్నికల్లో తక్కువ సీట్లు సాధించడంపై పార్టీలో చర్చ జరుగుతున్నది. ఈ ఫలితాలు కాంగ్రెస్ పార్టీపై, ప్రభుత్వంపై ఎలాంటి ప్రభావం చూపుతాయనే అంశంపై పార్టీలో అం తర్గతంగా చర్చించుకుంటున్నారు.