హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 4: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే రిపోర్టు అశాస్త్రీయంగా ఉందని బీసీ జాక్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ తిరుణహరి శేషు విమర్శించారు. హనుమకొండలోని కేయూ దూరవిద్యా కేంద్రంలోని పూలే విగ్రహాల వద్ద మంగళవారం సర్వే రిపోర్టుపై నిరసన వ్యక్తంచేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ శేషు మాట్లాడుతూ కులగణన నివేదికలో బీసీలను 46 శాతంగా తకువ చేసి చూపించడాన్ని వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. 2014లో అప్పటి ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో 51 శాతం ఉన్న బీసీ జనాభా 46 శాతానికి ఎలా తగ్గిపోయిందని ప్రశ్నించారు.
కులగణన అర్థమే మార్చింది
ఖిలావరంగల్, ఫిబ్రవరి 4: ఈడబ్ల్యూఎస్ కోటా కోసమే బీసీ జనాభాను తగ్గించిన కాంగ్రెస్ ప్రభుత్వం సమగ్ర కు ల జన గణన అర్థాన్నే మార్చేసిందని బీసీ రైటర్స్ వింగ్ స్టేట్ చైర్మన్ డాక్టర్ చింతం ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. 2011లో 60 శాతం ఉన్న బీసీ జనాభాను ఇరవై లక్షలు తగ్గించి 56.33 శాతంగా చూపించడం విచారకరమన్నారు.
ఏడు శాతం ఉన్న ఓసీ జనాభాకు 10 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు కాంగ్రెస్ పన్నిన అతి పెద్ద కుట్ర అని మండిపడ్డారు. 20 లక్షల బీసీ జనాభా ఎటు పోయిందో కాంగ్రెస్ పెద్దలే చెప్పాలన్నారు. కామారెడ్డి డిక్లరేషన్‌లో కాంగ్రెస్ బీసీలకు ప్రకటించిన 42 స్థానిక సంస్థల కోటా అనేది 60 శాతమున్న బీసీలకు చెందుతుందని చెప్పారు.