రంగారెడ్డి, జూన్ 18 (నమస్తేతెలంగాణ) : ఇండస్ట్రియల్ పార్కుల కోసం రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాయపల్లి గ్రామం లో ప్రభుత్వం పోలీసు పహారా మధ్య ఎంజాయ్మెంట్ సర్వే ప్రారంభించింది. సర్వే నంబర్ 9లో 365 ఎకరాల ప్రభుత్వ భూమిని గతంలో పేదలకు కేటాయించి పట్టాలిచ్చారు. సుమారు 150 మందికి పైగా రైతులు ఈ భూములపై ఆధారపడి జీవిస్తున్నారు. ఈ భూములు ప్రతిపాదిత ఇండస్ట్రియల్ పార్కుకు సమీపంలో ఉండటంతో సర్కార్ కన్నేసింది. ఈ భూములు ఇవ్వడానికి కొంతమంది రైతులు అంగీకరించటంతో ఎంజాయ్మెంట్ సర్వే చేస్తున్నారు. కానీ కొందరు రైతులు ఈ సర్వేకు దూరంగా ఉన్నారు. సుమారు 30 వేల ఎకరాల్లో పార్క్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. కానీ 14వేల ఎకరాలను ఫార్మాసిటీకోసం సేకరించిన భూములతోపాటు అదనంగా మరో 16 వేల ఎకరాలను సేకరించే పనిలో పడింది. అందులో భాగంగానే తిమ్మాయపల్లిలోని సర్వే నంబర్ 9లోని 365 ఎకరాలను తీసుకోవాలని నిర్ణయించింది. ఎకరాకు రూ.37 లక్షలు రైతులకు ఇస్తామంటూ అధికారులు సర్వే చేస్తున్నారు. సర్వేచేస్తున్న నేపథ్యంలో పోలీసులను పెద్ద ఎత్తున మోహరించారు.