మంచిర్యాల, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మంచిర్యాలలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు భూములు ఇవ్వాలంటూ బెదిరించి సంతకాలు తీసుకున్నారని బాధిత దళిత రైతులు వాపోయారు. ఎలాంటి పబ్లిక్ నోటిఫికేషన్ లేకుండా ఐటీ పార్క్ కోసమని తమతో బలవంతంగా సంతకాలు చేయించుకున్న పేపర్లను తిరిగి ఇవ్వాలని కోరుతూ మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం పోచంపాడు, వేంపల్లి రైతులు సోమవారం ప్రజావాణిలో కలెక్టర్ కుమార్ దీపక్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. అక్రమంగా సంతకాలు సేకరించిన మంచిర్యాల ఆర్డీవో, హాజీపూర్ తహసీల్దార్‌పై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. ‘ఐటీ పార్క్‌కు మీ భూములు తీసుకుంటాం. మీవన్నీ లావణి పట్టా భూములు. మీరు ఇప్పుడు సంతకాలు పెట్టకపోతే ప్రభుత్వం పరిహారం ఏమీ ఇవ్వకుండానే గుంజుకుంటుంది’ అని ఈ నెల 5న ఓ ప్రైవేటు ఫంక్షన్‌హాల్‌కు పిలిపించి బెదిరించారని వాపోయారు. ‘మేం చెప్పినట్టు వింటే ఎకరానికి రూ.13.50 లక్షలు, ఇందిరమ్మ ఇండ్లు, ఇంటికో ఉద్యోగం ఇస్తాం’ అని చెప్పి బలవంతంగా సంతకాలు చేయించుకున్నారని ఆరోపించారు.
హాజీపూర్ మండలం ముల్కల్ల, వేంపల్లి గ్రామాలకు చెందిన ఇద్దరు బడా లీడర్లు భూముల కోసం కొద్ది రోజులుగా తమపై ఒత్తిడి తెస్తున్నారని వాపోయారు. ఎకరాకు రూ.50 లక్షలు వచ్చే భూములను రూ.13.50 లక్షలకు ఇవ్వమనడం ఎంత వరకు న్యాయమో అర్థం కావడం లేదన్నారు. తక్కువ డబ్బులు ఇచ్చి, పరిహారంగా వచ్చే డబ్బులను వాళ్ల ఖాతాల్లోకి మళ్లించుకునేందుకు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. నోటిఫికేషన్ ఇవ్వకుండా అధికార పార్టీ లీడర్లు అన్యాయం చేస్తుంటే అడ్డుకోవాల్సిన రెవెన్యూ అధికారులే వారికి వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. రహస్యంగా నిర్వహించిన మీటింగ్‌కు అనధికారికంగా వచ్చిన ఆర్డీవో, తహసీల్దార్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మీటింగ్‌కు వస్తే మాట్లాడుకుందామని చెప్పి తీసుకువెళ్లిన నాయకులు బెదిరించి మరీ, సంతకాలు చేయించుకున్నారని ఆరోపించారు. 20 ఏండ్లుగా సాగు చేసుకుంటున్న భూములను తీసుకుంటూ.. బెదిరించారని చెప్తున్నా సదరు లీడర్లపై, అధికారులపై చర్యలు తీసుకునే నాథుడే కరవయ్యారని వాపోయారు. చట్ట ప్రకారం ఆ భూములపై వచ్చే ప్రతి పైసా పరిహారం అర్హులకు చేరేరా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు. ఎంత పరిహారం ఇవ్వాలనే అంశంపై ప్రభుత్వానికి ప్రపోజల్ పంపిస్తామని, నోటీసులు ఇచ్చి అందరితో మీటింగ్ పెడుతామని ఈ సందర్భంగా కలెక్టర్ హామీ ఇచ్చారని రైతులు పేర్కొన్నారు. రైతులందరం కలిసి ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తామని, న్యాయం జరిగేలా అధికారులు సహకరించాలని ఈ సందర్భంగా రైతులు విజ్ఞప్తి చేశారు.
మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలో 276.09 ఎకరాల్లో ఐటీ పార్క్ ఏర్పాటుకు భూసేకరణ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అధికార పార్టీ నాయకులు ఇందులో జోక్యం చేసుకొని రైతులను బెదిరించి సంతకాలు తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో రైతులు సైతం న్యాయ పోరాటానికి సిద్ధం అవుతున్నారు. ‘నోటిఫికేషన్ ఇవ్వకుండా మీటింగ్ ఎలా పెట్టారు? దానికి ఆర్డీవో, తహసీల్దార్ ఎలా హాజరయ్యారు? అసలు 276.09 ఎకరాల్లో ఏ ఇండస్ట్రియర్ పార్క్ పెడుతారు? ఇది గవర్నమెంటుదా లేకపోతే ప్రైవేటుదా చెప్పాలి’ అని గతంలోనే దొమ్మటి అర్జున్ అనే రైతు తహసీల్దార్‌కు సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేశారు.
15 రోజులు దాటిపోయినా దానిపై వివరణ రాకపోవడంతో ఈ రోజు కలెక్టరేట్‌కు వచ్చిన రైతులు, కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో పాటు వాళ్లకు వచ్చిన కొద్దిపాటు చదువుతో ఇంగ్లిష్‌లో ఓ ఆర్టీఐ దాఖలు చేశారు. దీనిపై దొమ్మటి అర్జున్ మాట్లాడుతూ.. ఫంక్షన్హాల్లో జరిగిన మీటింగ్ అధికారికంగా జరిగిందా? అనధికారికంగా జరిగిందా? అధికారులు సమాధానం ఇచ్చి తీరాలని చెప్పారు. బెదిరించి సంతకాలు చేయించుకున్నారని ఇంతమంది రైతులు చెప్తున్నా అధికారులు కనీసం దానిపై ఎలాంటి విచారణ చేయకపోవడం అనుమానాలకు తావిస్తున్నదని తెలిపారు. ఆర్టీఐ వేసి 15 రోజులు దాటినా ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని మండిపడ్డారు. ఇప్పటికైనా కలెక్టర్ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలని కోరారు.