ఉప్పునుంతల, మార్చి 4 : యాసంగి పల్లీ పంట కాలం పూర్తయిన తర్వాత ఆలస్యంగా మేల్కొన్న అధికారులు తాజాగా కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. తీరా పంటను తెచ్చిన తరువాత గన్నీ బ్యాగులు లేవంటూ కొనుగోళ్లు ఆపేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నాగర్కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండల కేంద్రంలో సోమవారం సింగిల్విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పల్లీ కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆర్భాటంగా ప్రారంభించారు.
ఇప్పటికే 90 శాతం పంటను తక్కువ ధరకు అమ్ముకొని రైతులు నష్టపోయారు. కొనుగోలు కేంద్రం ఏర్పాటు కావడం.. మద్దతు ధరకు కొంటున్నారని తెలుసుకొన్న సదగోడు, మొల్గర, ఇప్పకుంటతోపాటు పలు గ్రామాల రైతులు 2 వేల బస్తాలను ట్రాక్టర్లు, ఇతర వాహనాల్లో సోమ, మంగళవారాల్లో కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చారు. అయితే గన్నీ బ్యాగులు లేకపోవడంతో పంటను అధికారులు కొనుగోలు నిలిపేశారు. చేసేదేమీ లేక రైతులు గోదాం వద్దే పడిగాపులు కాస్తున్నారు.