పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ జిల్లా నందిపేట్లో ఐలమ్మ విగ్రహం వద్ద గుత్ప, అలీసాగర్ లిఫ్ట్ నిర్వహణ కాంట్రాక్ట్ కార్మికులు బుధవారం ధర్నాకు దిగారు. వేలాది ఎకరాలకు సాగునీరందించే ఎత్తిపోతల పథకాల్లో పనిచేసే తమకు ఐదు నెలలుగా జీతాలు చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వం వెంటనే జీతాల బకాయిలు విడుదల చేయాలని, తమ సర్వీసులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు.

సీతారామ ప్రాజెక్టు నీటిని మైదాన ప్రాంతాలకు తీసుకెళ్లి ఏజెన్సీ ప్రాంతాలకు అన్యాయం చేస్తారా? అంటూ సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో గిరిజనులు బుధవారం నిరసన తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం బద్దుతండాలో స్థానికులు ‘మొదట ఏజెన్సీ ప్రాంతాలకే గోదావరి నీళ్లు ఇవ్వాలి’ అనే కరపత్రాలను ప్రదర్శించారు. ముగ్గురు మంత్రులున్నా ‘రోళ్లపాడు’కు అన్యాయం చేస్తారా? అని మండిపడ్డారు.

తమ గ్రామానికి ఆర్టీసీ బస్సు సర్వీసును పునఃప్రారంభించాలని డిమాండ్ చేస్తూ భద్రాద్రి జిల్లా టేకులపల్లి మండలం రామచంద్రునిపేట పంచాయతీ పాతర్లగడ్డలో సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో బుధవారం గ్రామస్థులు నిరసన తెలిపారు. తమకు ఎంతో ఉపయోగకరంగా ఉండే ‘బోడు’ బస్సును తిరిగి ప్రారంభించకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు.