హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో తాము అధికారంలో వస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని అసెంబ్లీ ఎన్నికల ముందు కామారెడ్డి డిక్లరేషన్‌లో కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఎన్నికల మ్యానిఫెస్టోలోనూ ఈ అంశాన్ని పొందుపరిచింది. ఆ తరువాత ఇంటింటి సర్వే నిర్వహించిన కాంగ్రెస్ సర్కార్ ఆ గణాంకాల ఆధారంగా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో బిల్లు పెట్టగా, సభ ఆమోదం తెలిపింది. బీఆర్ఎస్ సహా అన్ని పక్షాలూ ఇందుకు మద్దతు తెలిపా యి. బీసీ రిజర్వేషన్లకు అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం తెలిపిన నేపథ్యంలో, కేంద్రం కూడా ఆమోదించేలా ఒత్తిడి తెస్తామంటూ ఢిల్లీలో సైతం ధర్నా నిర్వహించింది. మరోవైపు, ఈ అంశం రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉండగానే, ఆర్డినెన్స్ ద్వారా 42% రిజర్వేషన్లు కల్పిస్తామంటూ గవర్నర్‌కు ప్రతిపాదనలు పంపింది.
ఒకవేళ చట్టబద్ధంగా సాధ్యం కాకపోతే, పార్టీ పరంగానైనా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్తున్నది. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల ఖరారుకు ఇటీవల హైకోర్టు విధించిన గడువు ముగిసినప్పటికీ, 42% కోటాపై ఇంకా అనిశ్చితి కొనసాగుతూనే ఉన్నది. కానీ, బీఆర్ఎస్ మాత్రం ఇటువంటి డిక్లరేషన్లు, హామీ లు, అసెంబ్లీ తీర్మానాలు, ధర్నాలు లాంటివేవీ లేకుండానే గత స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు పెద్దపీట వేసింది. ఆనాడు నిర్దేశించిన 22.79 శాతానికి మించి 32% సీట్లను బీసీలకు కేటాయించి, బడుగు బలహీనవర్గాల పట్ల తన చిత్తశుద్ధిని ఆచరణలో చూపెట్టింది. బీఆర్ఎస్ అధినేత, అప్పటి ముఖ్యమంత్రి కేటీఆర్.. జనరల్ స్థానాల్లోనూ బడుగు, బలహీనవర్గాలకు ప్రాధాన్యమిచ్చి టికెట్లు కేటాయించారు. కొన్ని జిల్లాల్లో అత్యధికంగా 50 శాతానికి మించి టికెట్లను బీసీలకు ఇచ్చి సామాజిక న్యాయాన్ని ఆచరణలో పెట్టారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, ఇతర వెనకబడిన వర్గాలకు కల్పిస్తున్న రిజర్వేషన్లు మొత్తంగా 50% దాటకూడదనేది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో 2019 జనవరిలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో 50% సీలింగ్‌ను దాటకుండా 2011 జనాభా లెక్కల ఆధారంగా రిజర్వేషన్లను ఖరారు చేశారు. అందులో భాగంగా జడ్పీటీసీ ఎన్నికల్లో బీసీలకు 22.79%, ఎస్సీలకు 20.53%, ఎస్టీలకు 6.68% సీట్లను రిజర్వ్ చేశారు. మిగతా 50% సీట్లను జనరల్ స్థానాలుగా ప్రకటించారు. అయితే, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బడుగులకు నిర్దేశిత స్థానాల కంటే అత్యధికంగా సీట్లను కేటాయించారు. జనరల్ స్థానాల్లోనూ బీసీలతోపాటు ఎస్సీ, ఎస్టీలకు సైతం అవకాశాలు కల్పించారు. బీసీలకు నిర్ణయించిన దానికంటే ఎక్కువగా 31.35% అంటే దాదాపు 32% టికెట్లను కేటాయించారు. రాష్ర్టానికి యూనిట్‌గా తీసుకున్న నేపథ్యంలో బీసీలకు 90 సీట్లు మాత్రమే రిజర్వ్ కాగా, బీఆర్ఎస్ పార్టీ ఏకంగా 169 స్థానాలను కేటాయించింది. జనరల్ స్థానాల్లోనూ బీసీలకు పెద్దపీట వేయడం విశేషం.
గణాంకాల సేకరణ చట్టం-2008, రిజిస్ట్రర్ ఆఫ్ ఎంక్వయిరీస్ చట్టం-1952 ప్రకారం ఏరకంగా చూసినా కులగణన లేదా జనాభా గణన అనేది కేంద్ర జాబితాలోని అంశం. గణన నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వాలకు ఎలాంటి అధికారం లేదు. నిర్వహించినా ఆ గణాంకాలు చెల్లబోవు. ఇటీవల ఇదే విషయాన్ని కేంద్ర క్యాబినెట్ సూపర్ కమిటీగా పేరొందిన ప్రధాని మోదీ నేతృత్వంలోని రాజకీయ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీపీఏ) కుండబద్దలు కొట్టిమరీ చెప్పింది. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోపే కులగణన, బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా స్థానిక సంస్థల్లో బీసీలకు ప్రస్తుతమున్న 23% రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతామని హామీ ఇచ్చింది. కానీ, అమలు చేయాలనే చిత్తశుద్ధి కాంగ్రెస్‌లో లేదు.
కమిషన్ల నియామకం.. ఇంటింటి సర్వే నిర్వహణ.. నివేదికలు.. అసెంబ్లీలో బిల్లుల ఆమోదం వరకూ ప్రభుత్వం వ్యవహరించిన తీరే ఇందుకు అద్దం పడుతున్నది. ఒకసారి కేంద్రం 9వ షెడ్యూల్లో చేర్చాలని, అది కాదంటే పార్టీ పరమైన రిజర్వేషన్లు కల్పిస్తామని, మరోసారి రాజ్యాంగబద్ధంగా కల్పిస్తామని, ప్రస్తుతం ఆర్డినెన్స్ ద్వారా అమలు చేస్తామని పూటకో మాట చెబుతూ రిజర్వేషన్ల అంశాన్ని పూర్తిగా గందరగోళం చేస్తున్నది.
10 జిల్లాల్లో.. 30% పైబడి
9 జిల్లాల్లో.. 40% మించి