హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ) : ఎమ్మార్ ప్రాపర్టీస్ వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ 12వ నిందితుడు కందుల విశ్వేశ్వరరావు దాఖలు చేసుకున్న పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు మంగళవారం విచారణ జరిపింది. రాష్ట్ర విభజనకు ముందు పరిశ్రమల శాఖ కార్యదర్శిగా పనిచేసిన కందుల విశ్వేశ్వరరావు ఎమ్మార్ ప్రాజెక్టుకు ప్రయోజనం చేకూర్చి ఏపీఐఐసీకి నష్టం కలిగించారని సీబీఐ వాదించింది. అందుకు ప్రతిఫలంగా విశ్వేశ్వరరావు ఆ కంపెనీ నుంచి లబ్ధిపొందారని, ఎంతో ఖరీదైన ప్లాటును చదరపు గజం రూ.5 వేల చొప్పున కారుచౌకగా తీసుకున్నారని తెలిపింది.
ఎమ్మార్ ప్రాపర్టీస్‌కు ప్రభుత్వ భూమి కేటాయింపుల వల్ల ఏపీఐఐసీ రూ.43.50 కోట్ల నష్టం వాటిల్లిందని, నిందితులు అక్రమంగా రూ.167.29 కోట్ల లబ్ధిపొందారని వివరించింది. ఇందులో కుట్ర కోణం ఉన్నదని, ఎకరం భూమి ధరను రూ.29 లక్షల నుంచి రూ.40 లక్షలకు పెంచాలన్న ఏపీఐఐసీ ప్రతిపాదనను పిటిషనర్ తిరసరించడాన్ని తీవ్రంగా పరిగణించాలని కోరారు. ఈ వాదన అనంతరం తదుపరి విచారణను ఈ నెల 17కు వాయిదా వేస్తున్నట్టు జస్టిస్ జూకంటి అనిల్ కుమార్ ప్రకటించారు.