Real Estate | హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 13 (నమస్తే తెలంగాణ): అవసరాన్ని ఆసరాగా చేసుకొని ఆస్తులను రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ తరువాత బిచాణా ఎత్తేస్తున్న ముఠాలు హైదరాబాద్‌లో సంచరిస్తున్నాయి. బాధితులు సీసీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. సంగారెడ్డి జిల్లా కంది మండలం ఆరుట్లకు చెందిన పీ రంజిత్‌రెడ్డి, పీ రంగారెడ్డి సోదరులు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. తమ అవసరాల కోసం ఆరెకరాల పొలం మార్టిగేజ్ చేసి రూ. 6 కోట్ల రుణం తీసుకోవాలనుకున్నారు. ఇందుకు తమ వ్యాపార భాగస్వామి ప్రభాకర్‌రెడ్డితో చర్చించి, అతడి ద్వారా మధ్యవర్తులు ఎర్ర విగ్నేష్ గౌడ్, గోశిక విశ్వనాథం కలిసి రుణం విషయం మాట్లాడారు. 5 శాతం కమిషన్‌తో ఆరు కోట్లు ఇప్పిస్తామంటూ బంజారాహిల్స్‌కు చెందిన ఫైనాన్సియర్ కేవీ ప్రసాద్ గుప్తాను కలిపించారు. ముందుగా ఒక శాతం ప్రాసెసింగ్ ఫీజు చెల్లిస్తే తాను ఎంఓయూ రాసుకొని, రిజిస్ట్రేషన్ తరువాత 45 రోజుల్లో మీకు రూ. 5 కోట్లు ఇస్తానంటూ నమ్మించి, ఒప్పందం చేసుకున్నాడు.
ఈ మేరకు ప్రాసెసింగ్ ఫీజు కింద రూ. 6 లక్షలు అందించి, ఫిబ్రవరి, 2022లో ఐదెకరాల పొలాన్ని కేవీ ప్రసాద్‌గుప్తా పేరిట రిజిస్ట్రేషన్ చేశారు. 45 రోజుల తర్వాత డబ్బులివ్వకుండా రేపు మాపంటూ దాటవేస్తూ వచ్చారు. ఏప్రిల్, 2022 నుంచి ప్రసాద్ గుప్తా కనిపించకపోవడంతో రంజిత్‌రెడ్డి సోదరులు, వారి భాగస్వామి ప్రభాకర్‌రెడ్డి లోతుగా ఆరా తీశారు. తాము రిజిస్ట్రేషన్ చేసిన ఐదెకరాల పొలాన్ని మధ్యవర్తి జయన్న సహకారంతో పీ లక్ష్మీదేవి పేరుపై రిజిస్ట్రేషన్ చేసి, ఆమె నుంచి రూ. 1.2 కోట్లు అప్పు తీసుకున్నట్టు తెలిసింది. లక్ష్మీదేవి, మధ్యవర్తులు విగ్నేశ్వర్గౌడ్, గోశిక విశ్వనాథం, జయన్న, కేవీ ప్రసాద్ అంతా ఒక ముఠాగా ఏర్పడి అమాయకులను మోసం చేస్తున్నారని రంజిత్‌రెడ్డి సోదరులు సీసీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాపు చేపట్టారు.