నిజామాబాద్ : బీజేపీ, ప్రధాని మోదీ తెలంగాణకు ప్రధాన శత్రువులు. కేంద్రంలోని బీజేపీ వల్ల రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. జిల్లాలోని బాల్కొండ నియోజకవర్గం నుంచి వివిధ పార్టీలకు చెందిన యువకులు పెద్ద ఎత్తున మంత్రి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.
మంత్రి వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..కేసీఆర్ మాత్రమే తెలంగాణకు శ్రీరామ రక్ష అన్నారు. నాడు తెలంగాణ వనరులను దోచుకెళ్తుంటే భరించలేకే కేసీఆర్ ఉద్యమించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారన్నారు. సీఎం కేసీఆర్ సహకారంతో నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.
రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ అభివృద్ధి చేస్తుంటే బీజేపీ ప్రభుత్వం అడ్డుపడుతుందని విమర్శించారు. తెలంగాణకు కేంద్రం ఏ మాత్రం సహకరించడం లేదన్నారు. అయినా కూడా దేశంలోని అన్ని రాష్ట్రాలు తెలంగాణ అభివృద్ధిని చూసి ఇప్పుడు నేర్చుకుంటున్నాయని తెలిపారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తూ దేశాన్ని అమ్ముకుంటున్నారని విమర్శించారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరిని కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు.